ఇందిరమ్మ రెండో దశకు కొత్త ఆంక్షలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:53 AM
రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొత్త ఆంక్షలు ఆటంకంగా మారుతున్నాయి.
గుడిసెలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వులు
తాజా నిబంధనతో అయోమయంలో లబ్ధిదారులు
నిర్మల్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొత్త ఆంక్షలు ఆటంకంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండో దశ లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఈ ఆటంకాలు పథకం అమలు కాకుండా అడ్డుపడుతున్నాయి. గుడిసెల్లో ఆవాసం పొందుతున్న వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త నిబంధనల్లో చేర్చారు. అయితే ఇప్పటికే అధికారులు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 5,772 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 4,500 మందికి పైగా గుడిసెలు లేని వారని అధికారులు మొదట నిర్ధారించారు. వీరందరు అద్దె నివాసాల్లోనూ ఇతర చిన్న పెంకుటిల్లు, రేకుల ఇళ్లలోనూ నివసిస్తున్నట్లు గుర్తించారు. కేవలం 1200 మంది మాత్రమే గుడిసెల్లో నివసిస్తున్నట్లు చూపిన అధికారులు మిగతా 4,500 మంది దరఖాస్తుదారులు మాత్రం ఇతర నివాసాల్లో ఉంటున్నట్లు చూపారు.
నిబంధనలతో ఆటంకాలు
మొదటి విడతలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అర్హత ఉన్న లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం తాజాగా గుడిసెల్లో నివాసం అనే నిబంధనను తెరపైకి తేవడంతో ఈ ప్రక్రియకు ఆటంకాలు మొదలయ్యాయి. కొంతమంది ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానీ వారు ఈ గుడిసెల నిబంధనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రెండో దశ ఇళ్లకు ఎంపికైన వారు చాలా మంది గుడిసెలకు బదులుగా సిమెంటు గోడల ఇళ్లు, ఇతర ఇళ్లలో నివసిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వం గుడిసెల నిబంధనపై సీరియ్‌సగా దృష్టి సారించి ఆ నిబంధనను ఉల్లంఘించి ఎంపికైన లబ్ధిదారులను మొదటి ప్రాధాన్యం కింద పక్కన పెట్టాలని ఆదేశించింది. గుడిసెల్లో నివసించే వారికి రెండో దశ కింద ఇళ్లను మంజూరు చేశాకే ఇతర అర్హులైన వారికి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం సూచించినట్లు సంబందిత అధికారులుపేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే అర్హుల జాబితాలో ఉన్న పేదలంతా అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5,772 మంది రెండో దశ ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇందులో 4,500 మంది గుడిసెల్లో నివసించడం లేదని, వారిని పక్కన పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరి వివరాలు అన్‌లైన్‌లో కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
మాకు గతంలో పాత ఇల్లు ఉండేది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు చెప్పడంతో ఉన్న ఇంటిని కూల్చివేసుకున్నాం. ఉత్తర్వులు కూడా అందజేశారు. అయితే ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నా, బయట కిరాయి ఇంట్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి మా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని కోరుతున్నాం.
- పెంచల లక్ష్మి, మామడ
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News