Share News

దున్నకుండానే సాగు... బహు బాగు

ABN , Publish Date - Feb 01 , 2026 | 09:58 AM

ఒకే ఒక్కసారి పొలాన్ని దున్ని... పక్కనే నీరు పారేలా ఎత్తు మడులు వేసుకుంటే చాలు... 20 ఏళ్ల వరకు దున్నకుండా ఏడాదికి 3 పంటలు పండించొచ్చు. వరి, పత్తితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు.

దున్నకుండానే సాగు... బహు బాగు

వరి పొలాల నుంచి వెలువడే మిథేన్‌ వాయువును అరికట్టగలమా? సాగునీటిని, రసాయన ఎరువులు సగానికి సగం తగ్గించడం సాధ్యమా? దుక్కి దున్నకుండా పంటలు పండించవచ్చునా? నిత్యం పెరిగి పోతున్న పెట్టుబడిని తగ్గించి రైతులకు లాభాలు పెంచడం సాధ్యమా?

‘ఇలాంటి అనేక సందేహాలకు పరిష్కారం ఉంది’ అంటారు మహారాష్ట్రకు చెందిన అగ్రి నిపుణుడు చంద్రశేఖర్‌ భడ్సావ్లే(75). అమెరికాలో ఫుడ్‌ టెక్నాలజీలో ఎం.ఎస్‌ చేసిన చంద్రశేఖర్‌ దుక్కి లేకుండా సాగు చేసే ‘సగుణ రిజనరేటివ్‌ టెక్నిక్‌ ’విధానంలో సేద్యం చేస్తూ... దేశవ్యాప్తంగా యువ రైతులకు శిక్షణ ఇచ్చి అవగాహన కలిగిస్తున్నారు. మహారాష్ట్రలో 4 వేల మంది రైతులు ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నారు.


book4.jpg‘సగుణ’ సాగు అంటే?

ఒకే ఒక్కసారి పొలాన్ని దున్ని... పక్కనే నీరు పారేలా ఎత్తు మడులు వేసుకుంటే చాలు... 20 ఏళ్ల వరకు దున్నకుండా ఏడాదికి 3 పంటలు పండించొచ్చు. వరి, పత్తితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు. ‘‘పంట కోసినపుడు వేర్లు భూమిలోనే ఉండేలా చూడాలి. అవి కుళ్లి మట్టిలో కలిసి ఎరలు అభివృద్ధి చెందుతాయి. మొదటి ఏడాది రసాయనాలు తగుమాత్రం వాడి క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. 5 ఏళ్లలో పూర్తిగా ప్రకృతి ఎరువులకు ఆ భూమి అలవాటు పడుతుంది. ‘భూతాపం తట్టుకోవాలంటే పొలంలో పంట వేసిన ప్రతీసారి దున్నకుండా సగుణ పద్ధతిలో సేద్యం చేయగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంచుకోవడం మించి మరో మార్గం లేదు’’ అంటారు చంద్రశేఖర్‌.


తెలంగాణలో...

చంద్రశేఖర్‌ సలహాలతో జమ్మికుంటలోని ‘కృషి విజ్ణాన కేంద్రం’ సైంటిస్టుల సహకారంతో ఎస్‌ఆర్‌టీ (సగుణ రిజనరేటివ్‌ టెక్నిక్‌) పద్ధతిలో ఎత్తుమడుల పై పత్తి పండి స్తున్నారు. గతంలో కన్నా దాదాపు 30 శాతం దిగుబడి పెరిగింది. ‘‘ఈసారి వరి, కూరగాయల సాగు కూడా చేయాలనుకుం టున్నాం. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ రైతులు కొందరు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనిపై రెండు రాష్ట్రాల రైతులందరికీ అవగాహన కలిగించే పనిలో ఉన్నాం’’ అంటున్నారు వ్యవసాయ పరికరాల తయారీ నిపుణుడు, రైతు వెంకట్రావు. ఆయన చంద్రశేఖర్‌ వద్ద కొన్ని రోజులుండి ఎస్‌ఆర్‌టీ వ్యవసాయ విధానంపై అధ్యయనం చేసి, ఆ విధానాన్ని తొలిసారిగా తెలంగాణకు పరిచయం చేశారు. ఎస్‌ఆర్‌టీ పద్ధతిలో దున్నడం, నాట్లువేయడం, అధిక రసాయనాల వాడకం ఖర్చు ఉండదు. మామూలుగా పండించే విధానంలో ఎకరానికి అయ్యేఖర్చులో సగానికి సగం ఈ విధానంలో తగ్గిపోతుందని ఆయన చెప్పారు.


book4.4.jpgఇవీ ప్రయోజనాలు...

పంటలకు ముందు దుక్కి దున్నడం వల్ల నేల కోతకు గురై వానలకు సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. దుక్కి లేకుండా విత్తనాలు వేయడం వల్ల వానలు పడినా మట్టి కొట్టుకొని పోదు. నేరుగా విత్తనాలు నాటడం వల్ల నారు పెంచడం... కూలీలతో నాట్లు వేయడం లాంటి ఆర్ధికభారం ఉండదు. పాత పంటల వేర్లు నేలలోనే ఉంచడం వల్ల నేలలో పోషకాలు పెరుగుతాయి. దున్నే ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. నీటి వినియోగం 30 నుంచి 40 శాతం తగ్గుతుంది. నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. ఎరువుల అవసరం చాలా తగ్గుతుంది. నేల ఫెర్టిలిటీ సహజంగా పెరుగుతుంది. వేసవి వేడిలో కూడా తేమ తగ్గదు. అయితే ఒకే పంటను వరుసగా వేయకుండా, పప్పు దినుసులు, ధాన్యం, నూనె గింజల పంటలను మార్పిడి చేస్తారు.


‘‘దున్నకుండానే పంటలు పండుతాయంటే మొదట్లో నమ్మలేదు. కానీ ఎస్‌ఆర్‌టీ సాగు చేశాక... నేలలోని పురుగులు, సూక్ష్మజీవులు సహజంగా పెరిగి నేలను గుల్లపరిచి, తేమ ఎక్కువకాలం ఉండటం గమనించాం. ఎరువులు, రసాయనాల ఖర్చు భారీగా తగ్గిపోయింది. అన్నింటికన్నా ఆరోగ్యవంతమైన పంటలు పండుతున్నాయి’’ అంటున్నారు జమ్మికుంట రైతులు. భూతాపాన్ని తట్టుకునే శక్తి, పెట్టుబడి తగ్గించి దిగుబడులు పెంచే శక్తి సగుణ సాగు పద్ధతిలో ఉందని ఈ రైతులు గుర్తించారు.

- శ్యాంమోహన్‌, 94405 95858


ప్రత్యేక వాహనం... ‘ఇ జెబు’

ఎస్‌ఆర్‌టీ విధానంలో వ్యవసాయ పనుల కోసం ప్రత్యేకంగా ‘ఇ జెబు’ (E Zebu ) అనే వాహనాన్ని రూపొందించారు వెంకట్రావు. పొలంలో ఎత్తయిన మడుల మీద విత్తనాలు నాటడానికి మడుల పక్కనున్న ట్రెంచ్‌ల్లో పూడిక తీయడానికి, పురుగు మందుల పిచికారీకి, పంట కోతకు ఈ వాహనం ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్‌ భడ్సావ్లే ఆలోచనలకు అనువుగా ఈ వాహనం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇ జెబుని చంద్రశేఖర్‌ తన పొలంలో వాడుతూ వరి, గోధుమ, జొన్న, పెసలు, మిర్చి, టమాటా వంటివి పండిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కుప్పానికి ప్రగతి కళ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2026 | 09:58 AM