కుప్పానికి ప్రగతి కళ
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:42 AM
ఎన్నికల్లో సైకిల్‌కు ఓటేయడం ద్వారా ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు.
7,088 కోట్ల పెట్టుబడులు..16 పరిశ్రమలు
ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి
మెరుగైన వైద్యసేవలు ప్రజల వద్దకే చేరేలా రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు
కుప్పం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
నివాసం నుంచి ప్రజావేదిక వరకు ఈ-సైకిల్‌పై వచ్చిన ముఖ్యమంత్రి
24 గంటల్లో 5,555 ఈ-సైకిళ్ల పంపిణీతో కుప్పానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
కుప్పం/శాంతిపురం/గుడుపల్లె, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో సైకిల్‌కు ఓటేయడం ద్వారా ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు శనివారం ఆయన పర్యటించారు. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం బెగ్గిలపల్లెలో మునెమ్మ, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛన్, చిన్నతాయమ్మకు వితంతు పింఛన్‌ను పంపిణీ చేశారు. లబ్ధిదారుల కుటుంబసభ్యులతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత శాంతిపురం మండలం తుమ్మిశి వద్ద ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా అమలు కానంతగా సంక్షేమ పథకాలు మన వద్ద అమలవుతున్నాయి. నెలకు రూ.2,730 కోట్లను పెన్షన్ల రూపంలోనే పంపిణీ చేస్తున్నాం. తమిళనాడులో రూ.315 కోట్లు, కర్ణాటకలో రూ.392 కోట్లు మాత్రమే పెన్షన్ల కోసం కేటాయిస్తున్నారు. సూపర్‌సిక్స్‌లోని అన్ని పథకాలనూ అమలు చేసి సూపర్‌హిట్ చేశాం’’ అని వివరించారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన ప్రాధాన్యం కల్పించింది టీడీపీయేనన్నారు. ‘‘ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఎన్టీఆర్ కల్పిస్తే, నేను 33శాతం రిజర్వేషన్లను ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలు చేశాను. త్వరలో చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు రానున్నాయి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యాన్ని మరింత పెంచుతాం. డ్వాక్రా సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి విజయవంతమైన డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు సంజీవనిని ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ‘‘మెరుగైన వైద్య సేవలను ప్రజలకు ఇంటి వద్దకే అందుబాటులోకి తెచ్చేలా సంజీవని ప్రాజెక్టు అమలు చేసేందుకు నిర్ణయించాం.
కుప్పానికి రూ.7,088 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు రావడంతో ప్రత్యక్షం, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభించనుంది. వర్క్ ఫ్రమ్ హోం చేసుకునేవారికి, ఆఫీసు స్పేస్ లేనివారికి ఉపయోగపడేలా కుప్పంలో రాష్ట్రంలోనే తొలి కో- వర్కింగ్ స్పేస్‌ను ఏర్పాటు చేశాం’’ అని సీఎం వివరించారు.విధ్వంస పాలనతో రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ వెనక్కి నెట్టిందని మండిపడ్డారు. ‘‘వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగానే కూటమి ప్రభుత్వానికి భూవారసత్వ సమస్యలు వచ్చాయి. రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి పా సుపుస్తకాలపై, సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలను ముద్రించుకున్నారు. దుర్మారం చేసింది చాలక, ఇప్పుడు తమ పాలనే బెటర్ అంటూ మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో తెచ్చిన నల్లచట్టాన్ని కూడా సమర్థించుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డులో కుప్పానికి చోటు
జనవరి 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి 30వ తేదీ 12 గంటల వరకు 5,555 ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో కుప్పం నియోజకవర్గం చోటు సంపాదించుకుంది. ఇ-సైకిళ్లను ఇంత పెద్ద సంఖ్యలో పంపిణీ చేయడంపై ఈ రికార్డు నమోదు అయినట్లు గిన్నిస్ వరల్డ్ బుక్ ప్రతినిధి ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్, ఇ-సైకిళ్ల తయారీ సంస్థ ఇ-మోటరాడ్ ప్రతినిధులకు సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కుప్పాన్ని కాలుష్యరహితంగా మా ర్చేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5,555 ఇ-సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ప్రతి వెయ్యి ఇ-సైకిళ్ల ద్వారా ఏడాదికి 37 టన్నుల కార్బన్ డైయాక్సైడ్ తగ్గుతుంది. సైకిల్ అంటే పురోగతికి చిహ్నం. ఇ-సైకిల్ ఈతరానికి సింబల్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు.
4 కిలోమీటర్లు సైకిల్‌పై సీఎం
‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా బెగ్గిలపల్లెలో పెన్షన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు అనంతరం, కడపల్లెలోని తన నివాసం నుంచి తుమ్మిశిలోని ప్రజావేదిక వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఇ-సైకిల్‌లో ర్యాలీగా వచ్చారు. 75 ఏళ్ల వయసులోనూ సైకిల్ తొక్కుతూ రావడం చూసిన అక్కడి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలోని పీ4 బం గారు కుటుంబాలు- మార్గదర్శులతో సీఎం సమావేశమయ్యార. కుప్పంలోని మూడు మండలాలను దత్తత తీసుకున్న మేఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులతో ముఖా ము ఖిలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ ప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రూ.కోటితో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్
కుప్పం మున్సిపాలిటీలోని స్వర్ణ నవదిశ సెంటరులోని రెండు అంతస్తుల్లో అన్ని రకాల టెక్నాలజీ వసతులతో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి ప్రారంభించగా.. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కార్పొరేషన్ సంస్థ రూ.కోటి ఆర్థికసాయం అందించిందని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ఈ సెంటరు వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఫ్రీలాన్సర్లు లబ్ధి పొందుతారని, ము ఖ్యంగా గ్రామీణ పే ద కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మోహనకృష్ణను సీఎం చంద్రబాబు అభినందించారు.