ఆదాయానికి మించిన కేసులో రూ.30 లక్షలు డిమాండ్ చేసిన దర్యాప్తు అధికారి
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:05 AM
కాపలా కాయాల్సిన కంచే.. చేను మేసే యత్నం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ నిందితుడి నుంచి ఏసీబీ దర్యాప్తు అధికారి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. రూ.30 లక్షలు ఇస్తే కేసు నీరుగారిపోయేలా చేస్తానని ఆ అధికారి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: కాపలా కాయాల్సిన కంచే.. చేను మేసే యత్నం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ నిందితుడి నుంచి ఏసీబీ దర్యాప్తు అధికారి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. రూ.30 లక్షలు ఇస్తే కేసు నీరుగారిపోయేలా చేస్తానని ఆ అధికారి చెప్పారు. అయితే, దర్యాప్తు అధికారి కక్షకట్టినట్లు ప్రవర్తిస్తున్నారని తనపై ఫిర్యాదు చేయాలని, అప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిందితుడికి ఆ అధికారి సూచించాడు. హైదరాబాద్ శివార్లలో విద్యుత్తు పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఓ అధికారిపై నిరుడు నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తతంగం నడిచింది. ఆ కేసులో బెయిల్పై విడుదలైన నిందితుడు.. తన కేసును పర్యవేక్షిస్తున్న ఇన్స్పెక్టర్ రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారని ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
కాగా.. నిందితుడు నిరుడు సెప్టెంబరులో జైల్లో ఉన్నపుడు ఓ కాంట్రాక్టర్ అతడితో ములాఖత్ అయ్యారు. ‘నీ కేసును పర్యవేక్షిస్తున్న అధికారి నాకు తెలుసు. డబ్బులిస్తే కేసు మూయించేస్తా’ అని ఆ కాంట్రాక్టర్ ఆఫర్ చేశాడు. నిందితుడు బెయిల్పై బయటకు వచ్చాక మరోసారి కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఆ విషయంపై మాట్లాడాడు. ఈ క్రమంలో నిందితుడు తన బెయిల్ షరతుల విషయమై నిరుడు డిసెంబరులో ఏసీబీ ఆఫీసుకు వెళ్లాడు. ఆ సమయంలో దర్యాప్తు బృందంలోని ఓ కీలక అధికారి చేసిన సూచనతో దర్యాప్తు అధికారి ఆ నిందితుడితో బేరసారాలు జరిపారు.
రూ.30 లక్షలకు డీల్..
ఇదిలా ఉండగా.. ఆదాయానికి మించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినపుడు అతడికి బినామీగా అతనికి సమాన హోదా కలిగిన అధికారిని ఆ కేసులో చేర్చారు. అయితే నిందితుడితో సమాన హోదా కలిగిన అధికారిని బినామీగా చేర్చినట్లు ఏసీబీ ఉన్నతాధికారులకు తెలిసింది. దీనిపై వారు దర్యాప్తు జరిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో బినామీ అధికారిని తొలగించాలని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారం అంతర్గతంగా జరిగింది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు అధికారి తనకు అనుకూలంగా మార్చుకొని నిందితుడిని మభ్యపెట్టారు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో అధికారిక మార్గాల ద్వారానే ఆదాయం సమకూరినట్లు రికార్డులను మారుస్తానని దర్యాప్తు అధికారి ఆ నిందితుడికి చెప్పారు. ఇందుకు రూ.30 లక్షలు ఇవ్వాలని ఆ అధికారి డిమాండ్ చేశారు. దీంతో ఆ అధికారిపై నిందితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై అంతర్గతంగా దర్యాప్తు జరుగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి