Share News

ఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? అయితే ఈ 6 సెట్టింగ్‌లూ మార్చండి

ABN , Publish Date - Nov 16 , 2026 | 09:13 AM

ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా..? అయితే ఈ ఆరు సెట్టింగ్‌లూ మార్చి చూడండి.

ఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? అయితే ఈ 6 సెట్టింగ్‌లూ మార్చండి

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక అవసరానికి ఉపయోగిస్తూనే ఉంటాం. కాల్స్‌, వాట్సాప్‌, సోషల్‌ మీడియా, వీడియోలు, ఆన్‌లైన్‌ పనులు.. ఇలా రోజంతా ఫోన్‌ వాడుతుంటే బ్యాటరీ త్వరగా అయిపోవడం సహజం. అయితే ఈ బ్యాటరీ ఎక్కువసేపు రావడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంటున్నారు. ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఛార్జింగ్‌ ఎక్కువసేపు నిలిచేలా చూసుకోవచ్చని వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.


1. స్క్రీన్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేయండి

డిస్‌ప్లే కారణంగా ఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉంటే ఛార్జింగ్‌ వేగంగా తగ్గుతుంది. అందుకే అవసరానికి మించి బ్రైట్‌నెస్‌ పెంచకుండా చూసుకోవాలి. ఆటో బ్రైట్‌నెస్‌ ఆప్షన్‌ ఆన్‌ చేస్తే పరిసరాల్లోని వెలుతురును బట్టి స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ దానంతటదే మారుతుంది. అలాగే స్క్రీన్‌ టైమ్‌ఔట్‌నూ తగ్గించుకోవాలి. ఫోన్‌ ఉపయోగించడం ఆపిన తర్వాత స్క్రీన్‌ ఎంతసేపటికి ఆఫ్‌ కావాలనే సెట్టింగ్‌ ఇది. దీన్ని 15 లేదా 30 సెకన్లకు సెట్‌ చేసుకుంటే అవసరం లేకుండా స్క్రీన్‌ ఆన్‌లో ఉండదు. ఫోన్‌లో ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే, స్క్రీన్‌ సేవర్‌ వంటి ఫీచర్లు ఉంటే వాటిని ఆఫ్‌ చేయడం కూడా మంచిది.

2. డార్క్‌ మోడ్‌ ఉపయోగించండి

అన్ని స్మార్ట్‌ఫోన్లలో డార్క్‌ మోడ్‌ సదుపాయం ఉంటుంది. OLED, AMOLED డిస్‌ప్లే ఉన్న ఫోన్లలో డార్క్‌ మోడ్‌ ఉపయోగించడం వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే ఈ డిస్‌ప్లేల్లో నల్లని రంగు చూపించడానికి కొన్ని పిక్సెల్స్‌ పూర్తిగా ఆఫ్‌ అవుతాయి. రాత్రిపూట మాత్రమే కాకుండా రోజంతా డార్క్‌ మోడ్‌ ఉపయోగించుకోవచ్చు.

3. స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌ తగ్గించండి

కొత్త ఫోన్లలో 90Hz, 120Hz వంటి అధిక రిఫ్రెష్‌ రేట్‌ సదుపాయాలు ఉంటాయి. ఇవి స్క్రీన్‌పై కదలికలను మరింత స్మూత్‌గా చూపిస్తాయి. అయితే అధిక రిఫ్రెష్‌ రేట్‌ వల్ల బ్యాటరీ వినియోగం కూడా పెరుగుతుంది. అందుకే ఫోన్‌లో అవసరాన్ని బట్టి రిఫ్రెష్‌ రేట్‌ను తగ్గించుకోవచ్చు. 120Hzకు బదులుగా 60Hz ఉపయోగిస్తే కొంత బ్యాటరీ ఆదా అవుతుంది. మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఆప్షన్‌ ఉంటే దాన్ని ఎంచుకోవడం మరో మంచి మార్గం.


4. అవసరం లేని వైర్‌లెస్‌ ఫీచర్లను ఆఫ్‌ చేయండి

బ్లూటూత్‌, జీపీఎస్‌ వంటి వైర్‌లెస్‌ ఫీచర్లు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. కానీ వాటిని ఎప్పుడూ ఆన్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. లొకేషన్‌ సేవలు కొన్ని యాప్‌లకు నిరంతరం పనిచేస్తుంటే బ్యాటరీ వినియోగం పెరగొచ్చు. వాడని సమయంలో బ్లూటూత్‌, జీపీఎస్‌ను ఆఫ్‌ చేయండి.

5. ఎక్కువ బ్యాటరీ వాడే యాప్‌లను గుర్తించండి

కొన్ని యాప్‌లు మనం ఉపయోగించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటాయి. నోటిఫికేషన్లు పంపడం, డేటాను అప్‌డేట్‌ చేయడం, లొకేషన్‌ను గుర్తించడం వంటి పనుల కోసం బ్యాటరీని వినియోగిస్తాయి. అవసరం లేని యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్‌ యాక్టివిటీని పరిమితం చేయండి. అసలు ఉపయోగించని యాప్‌లను తొలగించండి. అయితే మెసేజింగ్‌, ఇమెయిల్‌ వంటి ముఖ్యమైన యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్‌ వినియోగాన్ని పూర్తిగా ఆపితే నోటిఫికేషన్లు ఆలస్యంగా వస్తాయి.

6. బ్యాటరీ సేవర్‌ మోడ్‌ను ఆన్‌ చేయండి

ఫోన్‌లో ఛార్జింగ్‌ తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్‌ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌ కార్యకలాపాలు, కొన్ని యానిమేషన్లు, సింక్రనైజేషన్‌ వంటి పనులను ఫోన్‌ పరిమితం చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. కొన్ని ఫోన్లలో బ్యాటరీ 20 శాతానికి చేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా సేవర్‌ మోడ్‌ ఆన్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు. అత్యవసర సమయంలో ఛార్జింగ్‌ అందుబాటులో లేకపోతే ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.


ఇవీ చదవండి

ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ వాలెట్.. కొత్త ఫీచర్ అందుబాటులోకి

ఒక్కసారి చదివాక మాయమైపోయే టెక్ట్స్ మెసేజెస్.. త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

Updated Date - Nov 16 , 2026 | 09:14 AM