Share News

బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:23 AM

బ్రేకప్ చెప్పిందని మాజీ ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడో యువకుడు. ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని, ఇబ్బందులకు గురిచేయాలని భావించాడు. ఇందుకోసం ఆమెకు ఇష్టమైన మూగజీవాలను ఎంచుకున్నాడు.

బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..
Kolkata Dog Cruelty

కోల్‌కతా, నవంబర్ 16: బ్రేకప్ చెప్పిందని మాజీ ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడో యువకుడు. ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని, ఇబ్బందులకు గురిచేయాలని భావించాడు. ఇందుకోసం ఆమెకు ఇష్టమైన మూగజీవాలను ఎంచుకున్నాడు. తన ప్రతాపాన్ని మాజీ ప్రేయసికి చెందిన కుక్కలపై చూపించాడు. వాటిని అత్యంత దారుణంగా హతమారుస్తూ, ఆమెకు వీడియో కాల్ చేసి చూపించాడు. ఈ అమానవీయ ఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది.


పోలీసుల వివరాల ప్రకారం.. దక్షిణ కోల్‌కతాలోని బిజయ్‌గఢ్‌-బిక్రమ్‌గఢ్‌ ప్రాంతంలో సంజీబ్‌ భట్టాచార్య, డీజే పరిణోవా సహజీవనం చేసేవారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడంతో అతడిని విడిచిపెట్టి ఆమె వెళ్లిపోయింది. అయితే తన రెండు పెంపుడు కుక్కలను మాత్రం సంజీబ్‌ వద్దే ఉంచింది. మాజీ ప్రేయసిపై కోపంతో రగిలిపోతున్న యువకుడు ఆమెను ఎలాగైనా వేధించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో పరిణోవాకు వీడియో కాల్ చేశాడు. అప్పుడు జరిగిన ఘటనను చూసి ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తన పెంపుడు కుక్కల్లో ఒకటి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన ఆమె.. వెంటనే తన స్నేహితుడిని సంజీబ్‌ ఫ్లాట్‌కు వెళ్లి చూడాలని కోరింది. అతడు అక్కడికి వెళ్లే సరికి రెండు కుక్కలూ రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించాయి.


యువతి ఫిర్యాదు మేరకు జాదవ్‌పూర్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సంజీబ్‌ను అరెస్టు చేశారు. నిందితుడు ఇటుకతో దాడి చేసి కుక్కలను చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నటి, జంతు హక్కుల కార్యకర్త దేబ్లీనా దత్తా ఘటనా స్థలానికి చేరుకుని కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

లిప్ కిస్ కావాలంటూ విదేశీ యువతికి వేధింపులు.. వైరల్‌గా మారిన వీడియో..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్..

Updated Date - Nov 16 , 2026 | 08:23 AM