Share News

వాహనదారులను భయపెట్టిన 'ఘోస్ట్‌ సైకిల్‌'!

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:28 PM

నేటి కాలంలో కొందరు యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో మరికొందరు యువత తమ ప్రతిభ, కృషితో కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాహనదారులను భయపెట్టిన 'ఘోస్ట్‌ సైకిల్‌'!
Shivam Maurya

ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో కొందరు యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో మరికొందరు యువత తమ ప్రతిభ, కృషితో కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతానికి చెందిన శివమ్ మౌర్య అనే యువ ఆవిష్కర్త.. ఓ వింతైన సైకిల్‌ను రూపొందించారు. మొండెం లేకుండా కేవలం కాళ్లతో రోడ్లపై ఆ సైకిల్ చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


శివమ్‌ మౌర్య రూపొందించిన డ్రైవర్ రహిత్ సైకిల్ అందరిని ఆకట్టుకుంది. రోడ్లపై మనిషి లేకుండా ముందుకు కదులుతున్న సైకిలును చూసి వాహనదారులు విస్తుపోతున్నారు. దీనికి ‘ఘోస్ట్‌ సైకిల్‌’ అని నామకరణం కూడా చేశారు. శివమ్, అతని స్నేహితుడు గుర్ ప్రీత్ అరోరాతో కలిసి దాదాపు 3 నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. ఈ సైకిల్ తయారికి రూ.35 వేలు ఖర్చు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెకానికల్‌ ఇంజినీరింగ్ పరిజ్ఞానాంతో శివమ్‌ మౌర్య ఈ సైకిలు తయారుచేశారు.


డ్రైవర్ లేకుండానే ఈ సైకిలు రోడ్డుపై పరుగుతీస్తూ తనంతట తానే బ్యాలెన్స్‌ చేసుకోవడం విశేషం. సైకిలు ముందుకు కదులుతుంటే.. నడుముతో మాత్రమే ఉన్న మనిషి కాళ్లు పెడల్స్‌ తొక్కుతున్నట్లుగా కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోను ద్వారా ఆదేశాలు ఇచ్చి సైకిల్‌ను నియంత్రించవచ్చు. అలానే రిమోట్‌ కంట్రోలుతో దూరం నుంచే కూడా ఈ సైకిల్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. ఏఐ మోడ్‌ ద్వారా సైకిల్ ముందుగా నిర్ణయించిన మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందులో అమర్చిన సెన్సర్ల సాయంతో ఎదురుగా ఏవైనా అడ్డంకులుంటే వాటిని గుర్తిస్తుంది. అంతేకాక తన మార్గాన్ని స్వయంగా మార్చుకునే ఈ సైకిల్ ముందుకు పరుగులు పెడుతుంది.


గతంలో గరుడ్‌ ఏఐ బైకు, సింగిల్‌ టైర్‌ స్కూటరు, రోబోటిక్‌ రిక్షా వంటి ప్రత్యేక ఆవిష్కరణలతో శివమ్‌ మౌర్య గుర్తింపు పొందాడు. ‘క్రియేటివ్‌ సైన్స్‌’ అనే పేరుతో అతడి సోషల్‌ అకౌంట్‌కు 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ డ్రైవర్ రహిత్ సైకిల్ గురించి శివమ్ మాట్లాడుతూ.. 'మేము ఈ సైకిల్‌ను రూపొందించి.. టెస్టింగ్ కోసం రోడ్డుపైకి తీసుకువెళ్లినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. సైకిల్‌పై ఎవరూ కూర్చోకపోయినా పెడల్స్ వాటంతట అవే కదులుతున్నాయి. పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి కొంచెం భయపడ్డారు. ఇదే సాంకేతికతతో భవిష్యత్తులో కాంటాక్ట్‌లెస్ డెలివరీ, పెద్ద క్యాంపస్‌ల్లో భద్రతా గస్తీ, కాలుష్య రహిత స్మార్ట్ రవాణా కోసం కొత్త ఆవిష్కరణలను రూపొందించాలని అనుకుంటున్నాను' అని మౌర్య తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ హత్యాచారం కేసులో నిందితుడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..

ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయిన 8 మంది.. ఏం జరిగిందంటే..

Updated Date - Apr 24 , 2026 | 12:41 PM