Share News

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం మాదే: అమిత్ షా..

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:23 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మెుదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం మాదే: అమిత్ షా..
Union Home Minister Amit Shah

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మెుదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన కోల్‌కతాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్నారు. రెండో దశలోనూ తామే ఎక్కువ సీట్లు నెగ్గుతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజీపీనే అంటూ ప్రకటించారు.


మమతా బెనర్జీ, టీఎంసీ ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. అందుకు మెుదటి దశలో 92.88 శాతం ఓటింగ్ నమోదు కావడమే నిదర్శనమన్నారు. బెంగాల్ ఓటర్లు అభివృద్ధిని ఎంచుకున్నారని తొలి దశ ఎన్నికలతో స్పష్టమైందని చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో మార్పు కోసం ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారన్నారు. మహిళల రక్షణ బీజేపీ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అవినీతిపరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. బెంగాల్‌లో బీజేపీ, పార్టీ అభ్యర్థులు తమ అంచనాలకు తగినట్లుగా పని చేశారని కితాబిచ్చారు.


మరోవైపు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించారంటూ ఎన్నికల సంఘం, స్థానిక పోలీసులు, భద్రతా దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలం తర్వాత ఒక్కరి ప్రాణం కూడా పోకుండా జరిగిన బెంగాల్ ఎన్నికలు ఇవేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఈనెల 23న పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగ్గా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తొలి దశలో 152 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ హత్యాచారం కేసులో నిందితుడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..

ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయిన 8 మంది.. ఏం జరిగిందంటే..

Updated Date - Apr 24 , 2026 | 01:53 PM