సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:44 AM
చైనా సేనలు, యుద్ధ ట్యాంకులు సరిహద్దుల్లో ఉన్నప్పుడు.. ఏం చేయాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వం సైన్యానికి ఇచ్చిందని, తమకు అన్ని విధాలా అండగా నిలిచిందని...
చైనా సేనలు సరిహద్దుల్లో ఉన్నప్పుడు
నిర్ణయాధికారాన్ని సైన్యానికి వదిలేసింది
మాకు అండగా నిలిచింది
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: చైనా సేనలు, యుద్ధ ట్యాంకులు సరిహద్దుల్లో ఉన్నప్పుడు.. ఏం చేయాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వం సైన్యానికి ఇచ్చిందని, తమకు అన్ని విధాలా అండగా నిలిచిందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే స్పష్టం చేశారు. చైనా సైన్యం, యుద్ధ ట్యాంకులు రెచిన్ లా పాస్ వద్ద మోహరించిన సమయంలో.. రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి మోదీ సర్కారు వెనుకాడిందని.. ‘మీకు ఏది సరైంది అనిపిస్తే అదే చేయండి’ అంటూ నిర్ణయాన్ని సైన్యానికి వదిలేసిందని.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఆరోపణకు రుజువుగా ఆయన.. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకాన్ని సభలో ప్రదర్శించారు. ఆ ఆరోపణలపై నరవణే తాజాగా స్పందించారు.
తాను రాసిన ‘ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్: అన్‌ఎర్తింగ్ మిలటరీ మిత్స్ అండ్ మిస్టరీస్’ పుస్తకం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ సమయంలో ప్రభుత్వం తమను వదిలేయలేదని స్పష్టం చేశారు. సాయుధ దళాలను, తనను రాజకీయాల్లోకి లాగడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి సర్కారు నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని, పరిస్థితి చెయ్యిదాటితే చైనా సైనికులపై కాల్పులు జరపడానికి అన్ని అధికారాలూ తమకు ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. భారత సైనికుల భద్రత ప్రమాదంలో పడినప్పుడు కాల్పులు జరిపే హక్కు ఎప్పుడూ ఉందని ఆయన గుర్తుచేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై తనకున్న మెరుగైన అవగాహన, సైన్యం సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం నేపథ్యంలో.. ఆ సమయంలో తనకు సరైనదనిపించిన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని భావిస్తున్నట్టు తెలిపారు.
ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో అంత సున్నితమైన విషయాలేవీ లేవని.. కాకపోతే, ఒక్కొక్కరి అవగాహన ఒక్కోలా ఉంటుందని అన్నారు. చైనా సేనలు మన సరిహద్దుల్లో ఉన్నప్పుడు నిర్ణయాధికారాన్ని సైనిక నాయకత్వానికి వదిలేయడం సరైన నిర్ణయమేనని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి భారత సైన్యంపై ఉన్న నమ్మకాన్ని అది తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒక కంపెనీ సీఈవో అయినా.. దేశాధినేత అయినా కీలకబాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. దానర్థం దేశం మిమ్మల్ని వదిలేసినట్టు కాదు. దేశం మొత్తం మీ వెనుకే ఉంది, సైన్యం అంతా మీతోనే ఉందని.’’ అని వివరించారు. తాను తీసుకున్న ఏ నిర్ణయానికైనా ప్రభుత్వ మద్దతు ఉండేదని.. అసలు కావాల్సింది అదేనని పేర్కొన్నారు.
‘‘అసలు మేం (సైన్యం) చాలా సందర్భాల్లో కాల్పులు జరుపుతాం. కాల్పులు జరపాలని ఆదేశించాల్సిన అవసరం లేదు. సైనికుల భద్రత ప్రమాదంలో పడినప్పుడు కాల్పులు జరపడానికి పూర్తి స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుంది’’ అని వెల్లడించారు. దీనిపై రాహుల్ గాంధీకి కాల్ చేసి రికార్డులను సరిచేయాలని తాను అడగనని స్పష్టం చేశారు. ‘‘నేను రాసింది రక్షణ శాఖ పరిశీలనలో ఉంది. అది పూర్తయ్యే దాకా దీనిపై నేను వ్యాఖ్యానించడం సరైంది కాదు’’ అని నరవణే స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి