వైద్య రంగంలో అలీబాబా ఏఐ సంచలనం.. సీటీ స్కాన్లతో వ్యాధులను గుర్తించే టెక్నాలజీ
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:18 PM
చైనా టెక్ దిగ్గజం అలీబాబా.. వైద్య రంగంలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరిస్తోంది. ఆ కంపెనీ పరిశోధనా విభాగం డామో అకాడమీ రూపొందించిన డామో రాడార్ అనే ఏఐ మోడల్ సీటీ స్కాన్ల ద్వారా క్యాన్సర్ సహా పలు వ్యాధులను గుర్తించగలదని పరిశోధకులు చెబుతున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: చైనా టెక్ దిగ్గజం అలీబాబా సంస్థకు చెందిన పరిశోధనా విభాగం డామో అకాడమీ.. వైద్య రంగంలో సరికొత్త ఏఐ మోడల్‌ను రూపొందించింది. దీనికి ‘డామో రాడార్’ అని పేరు పెట్టింది. ఈ ఏఐ మోడల్.. కాంట్రాస్ట్‌తో తీసిన సీటీ స్కాన్లను పరిశీలించి క్యాన్సర్ ట్యూమర్లు సహా వివిధ రకాల వ్యాధులు, శరీరంలోని అసాధారణ మార్పులను గుర్తించగలదు. పొత్తికడుపు అవయవాలకు సంబంధించిన సీటీ స్కాన్లను పరిశీలించి దాదాపు 146 రకాల వైద్య సమస్యలను గుర్తించగలిగేలా డామో రాడార్‌ను రూపొందించారు. దాదాపు 40 వేల సీటీ స్కాన్ పరీక్షలపై నిర్వహించిన టెస్టుల్లో ఈ మోడల్‌కు సగటు ఏయూసీ 0.913 అని వచ్చింది. వైద్య పరీక్షల్లో ఏయూసీ విలువ 1కి దగ్గరగా ఉంటే వ్యాధిని గుర్తించే సామర్థ్యం ఎక్కువగా ఉందని అర్థం. ఈ మోడల్‌ను వివిధ ఆసుపత్రులకు చెందిన 26 మంది రేడియాలజిస్టులతో పరీక్షించారు. డామో రాడార్ మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశోధకులు తెలిపారు.
వ్యాధిని గుర్తించే సమయం తగ్గింపు
డామో రాడార్‌ను సహాయక సాధనంగా ఉపయోగించినప్పుడు వ్యాధిని గుర్తించడానికి పట్టే సమయం 30 శాతానికి పైగా తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. కాగా.. ఈ పరిశోధన సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. వైద్య రంగంలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు డామో అకాడమీ ప్రస్తుతం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలో గుర్తించే టూల్స్‌పైనా పనిచేస్తోంది.
ఇవీ చదవండి:
ఆసియా గేమ్స్: సెమీ ఫైనల్ గ్రౌండ్‌పై వెల్లువెత్తుతున్న ఆందోళనలు
నేటినుంచే మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్