Yograj Singh: ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే జట్టులోంచే తీసేస్తారా?: యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 09:42 AM
టీ20 ప్రపంచ కప్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టు(T20 World Cup 2026)ను ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. టీ20ల్లో గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న గిల్‌ను.. జట్టు నుంచే తీసేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్(Yograj Singh) స్పందించారు.
‘టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్(Shubman Gill)ను జట్టులోంచి తొలగించడానికి కారణం ఏంటి? కేవలం 4,5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమైతే జట్టు నుంచే తీసేస్తారా? వంద అవకాశాలిస్తే కేవలం 10 మ్యాచుల్లో మాత్రమే రాణించే క్రికెటర్లు మన దగ్గర చాలా మంది ఉన్నారు. వారంతా ఇంకా ఆడుతూనే ఉన్నారు కదా?’ అని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు.
మద్దతుగా నిలవాలి..
‘అభిషేక్ శర్మ ఓ రెండేళ్ల క్రితం జట్టులోకి వచ్చాడు. అతడు ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే.. అతడిని కూడా జట్టులోంచి తీసేవేస్తారా? మీకో ఉదాహరణ చెబుతాను. బిషన్ సింగ్ బేడీ సారథ్యంలో టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించింది. అప్పుడు కపిల్ దేవ్ అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ తీవ్రంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ బిషన్ సింగ్ బేడీ అతడిని ఇంగ్లండ్ టూర్‌కు తీసుకెళ్లాడు’ అని యోగ్‌రాజ్ సింగ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!