IPL 2026: ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:29 PM
ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ(BCCI) వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి. ఇది తమ చేతుల్లో లేని వ్యవహారమని, దీనిపై ఇంతకు మించి మాట్లాడటానికి ఏమీ లేదని వెల్లడించాయి.
ముస్తాఫిజుర్ ఆడతాడా?
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న అబుదాబీలో జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించాడు. అయితే బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత వేళ.. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అతడిని ఐపీఎల్ నుంచి నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ముస్తాఫిజుర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. 8.13 ఎకానమీతో సమర్థవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు, అనంతరం ముంబై ఇండియన్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2021), ఢిల్లీ క్యాపిటల్స్ (2022–23), చెన్నై సూపర్‌కింగ్స్ (2024) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో సీఎస్కే అతడిని విడుదల చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్‌కు గాయమవడంతో రీప్లేస్‌మెంట్‌గా మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు.
షారుక్‌ఖాన్‌పై విమర్శలు..
ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేయడంపై ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ కేకేఆర్ యాజమాన్యాన్ని, సహ యజమాని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడిని ఐపీఎల్‌లోకి తీసుకోవడం సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి బాధ కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలా మంది నేతలు క్రీడలను రాజకీయ, దౌత్య అంశాల నుంచి వేరు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ సారి టీ20 ప్రపంచ కప్‌ను ఎవ్వరూ చూడరు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్