Shubman Gill: ఆ జ్ఞాపకాలన్నింటినీ 2026కి తీసుకెళ్తున్నా: శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:32 PM
టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. 2025 ఇచ్చిన జ్ఞాపకాల గురించి ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ఆ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని, ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భావోద్వేగాలు, సంతోషాలు, జ్ఞాపకాలు.. ఇలా ఎన్నో ఎమోషన్స్‌తో ఘనంగా 2025కి వీడ్కోలు పలికారు. ఎవరికి తోచినట్టు వారు.. తమ అనుభవాలను ఏదో రూపంలో పంచుకున్నారు. దీనికి సెలబ్రిటీలు, క్రికెటర్లు ఏమీ తీసిపోలేదు. 2025 తనకి నేర్పిన పాఠాల గురించి టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ పెట్టాడు.
‘2025 నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం. ఎన్నో పాఠాలు, అనుభవాలు, జ్ఞాపకాలను ఇచ్చింది. వాటన్నింటినీ 2026కి తీసుకెళ్తున్నా’ అని గిల్ తాను పోస్ట్ చేసిన రీల్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.
గిల్ ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాదిలో అతడు మూడు ఫార్మాట్లలో కలిపి 1,764 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో బాగా రాణించిప్పటికీ టీ20ల్లో మాత్రం తీవ్రంగా విఫలమయ్యాడు. ఫలితం.. వైస్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు. టీ20 వరల్డ్ కప్ 2026, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో 15 ఇన్నింగ్స్ ఆడిన గిల్.. కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ గడ్డపై ఆధిపత్యం చూపించిన గిల్.. ఐదు టెస్టు మ్యాచుల్లో ఏకంగా 754 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాదేశాడు. అలాగే వ్యక్తిగత అత్యధిక స్కోరు(269)ను నమోదు చేశాడు.
2025లో టెస్టుల్లో 70.21 యావరేజ్‌తో 983 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. అలాగే 11 వన్డేల్లో 49.00 యావరేజ్‌తో 490 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణించాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ సైతం నమోదు చేశాడు.
ఇవి కూడా చదవండి:
2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..
పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ