Ifran Pathan: రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:09 PM
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐకి ఓ సూచన చేశాడు. రో-కో ఉన్నన్ని రోజులు వన్డే సిరీస్‌లు పెంచాలని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రో-కో ఏడాది పొడవునా ఆటలో కొనసాగడానికి బీసీసీఐ మరిన్ని వన్డేలను షెడ్యూలు చేయాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Ifran Pathan) సూచించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు రో-కోకు తగినంత క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలని సూచించాడు.
‘మనం మూడు వన్డేల సిరీస్‌ల బదులు ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు. ఎందుకు త్రైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం లేదు. మంచి ఏంటంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రపంచ కప్ నేపథ్యంలో వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలి. ఒక వేళ అంతర్జాతీయ మ్యాచులు లేకపోతే వారు దేశవాళీ క్రికెట్‌లోనైనా వరుసగా మ్యాచులు ఆడాలి’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2025లో అద్భుత ప్రదర్శనలు చేశారు. ఆ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్స్‌గా నిలిచారు. విరాట్ 13 ఇన్నింగ్స్‌ల్లో 65.10 యావరేజ్‌తో 651 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. రోహిత్ శర్మ 14 ఇన్నింగ్స్‌ల్లో 50 యావరేజ్‌తో 650 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలోనూ వీరు రాణించారు. ఢిల్లీ తరఫున కోహ్లీ ఒక సెంచరీ (131), ఒక హాఫ్ సెంచరీ (77), ముంబై తరఫున రోహిత్ ఒక సెంచరీ (155*) సాధించారు.
టీమిండియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను చివరిసారిగా 2019లో ఆస్ట్రేలియాతో ఆడింది. అప్పటి నుంచి కేవలం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు మాత్రమే భారత జట్టు ఆడుతోంది. అలాగే చివరిసారిగా త్రైపాక్షిక సిరీస్‌లో 2015లో పాల్గొంది. ఆ సిరీస్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్ ఆడాయి. ఆ మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో జరిగాయి.
ఇవి కూడా చదవండి:
2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..
పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ