Share News

Australian Open: వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:19 PM

అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పునరాగమనం చేస్తున్నారు. జనవరిలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది.

Australian Open: వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!
Venus Williams

ఇంటర్నెట్ డెస్క్: ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌(Australian Open)లో అడుగు పెట్టనున్నారు. అమెరికాకు చెందిన ఈమెకు.. 45 ఏళ్ల వయసులో వైల్డ్‌ కార్డు ద్వారా చోటు దక్కింది. దీంతో సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనే పెద్ద వయస్కురాలిగా వీనస్ చరిత్ర సృష్టించనున్నారు.


ఇటీవలి కాలంలో పరిమితంగా మాత్రమే సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన వీనస్(Venus Williams), 2021 తర్వాత తొలిసారి మెల్‌బోర్న్ పార్క్‌లో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన డ్రాలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాకు తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అక్కడ నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉన్న ఈ టోర్నీలో మళ్లీ ఆడే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతగా భావిస్తున్నాను’ అని చెప్పారు.


వీనస్ ఐదు సార్లు వింబుల్డన్, రెండు సార్లు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిళ్లు సాధించారు. 2003, 2017 సంవత్సరాల్లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. అలాగే నాలుగు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచారు.


జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు వీనస్ ఆక్లాండ్ క్లాసిక్‌తో తన సన్నాహాలను ప్రారంభించనున్నారు. అనంతరం హోబార్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో కూడా ఆమె పాల్గొననున్నారు. 16 నెలల విరామం తర్వాత గత ఏడాది యూఎస్ ఓపెన్‌తో మళ్లీ టూర్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ఈ సారి టీ20 ప్రపంచ కప్‌ను ఎవ్వరూ చూడరు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్

Updated Date - Jan 02 , 2026 | 04:19 PM