Ravichandran Ashwin: ఈ సారి టీ20 ప్రపంచ కప్‌ను ఎవ్వరూ చూడరు.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:42 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ తీసుకున్న నిర్ణయాల వల్ల టీ20 ప్రపంచ కప్‌ను ఎవరూ చూడరని తీవ్ర విమర్శలు గుప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తీవ్ర విమర్శలు చేశాడు. ఐసీసీ నిర్ణయాల వల్ల ఈ సారి ప్రపంచ కప్‌నకు తీవ్ర నష్టం జరగనుందని వెల్లడించాడు. వ్యూయర్‌షిప్ దారుణంగా పడిపోనుందని హెచ్చరించాడు.
‘ఈ సారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీని ఎవరూ చూడరు. భారత్-యూఎస్ఏ, భారత్-నమీబియా.. ఈ మ్యాచులన్నీ ప్రపంచ కప్‌నకు అభిమానులను దూరం చేసేవే. ఒకప్పుడు ప్రపంచ కప్‌లు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. దానివల్ల ఆ టోర్నీపై సహజంగానే ఆసక్తి పెరిగేది. అప్పట్లో తొలి రౌండ్‌లో భారత జట్టు.. ఇంగ్లండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లతో తలపడేది. ఆ మ్యాచ్‌లు కూడా సరదాగా ఉండేవి.
నేను స్కూల్‌లో ఉన్నప్పుడు.. 1996, 1999, 2003 వన్డే ప్రపంచ కప్‌లు నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. మేం ప్రపంచ కప్ కార్డ్స్ సేకరించి ఆడుకునేవాళ్లం. మ్యాచ్‌ల షెడ్యూల్స్ ప్రింట్ తీసుకోవడం, న్యూస్ పేపర్ కటింగ్స్‌ను తీసి దాచుకునేవాళ్లం. ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లం. ఆ నిరీక్షణ మ్యాచ్‌లపై మరింత ఆసక్తిని పెంచేది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వాటిని ఐదు గ్రూప్‌లు విభజించి లీగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. 2014, 2016, 2021, 2022 టోర్నీల్లో మాత్రం టాప్ ర్యాంక్ దేశాలు నేరుగా సూపర్ 10/12 ఆడేవి. మిగతా అసోసియే దేశాలు గ్రూప్ స్టేజి ఆడి వచ్చేవి. కొవిడ్ కారణంగా 2020లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2021కి వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి:
2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..
పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ