Mumbai Indians: ఆధిపత్యం కొనసాగేనా?
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:27 AM
ఐపీఎల్‌లో మాదిరే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోనూ ముంబై ఇండియన్స్ జట్టు తమ సత్తాను చాటుకుంటూనే ఉంది. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో.......
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
ఐపీఎల్‌లో మాదిరే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోనూ ముంబై ఇండియన్స్ జట్టు తమ సత్తాను చాటుకుంటూనే ఉంది. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో ఆరంభ టైటిల్‌తో పాటు ప్రస్తుతం ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గానే బరిలోకి దిగబోతోంది. మధ్యలో ఒక్కసారి మాత్రమే తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. అలాగే రెండు టైటిళ్లను ఖాతాలో వేసుకున్న హర్మన్‌ప్రీత్ సేనకు ఒత్తిడిని ఎలా అధిగమించడంపై తగిన అనుభవం ఉంది. అందుకే ఇన్నాళ్లుగా తమ జట్టును విజయపథంలో నడిపిస్తున్న కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుని ప్రత్యర్థులకు సవాల్ విసరబోతోంది.
ఆల్‌రౌండర్ల హవా
నాట్ సివర్ బ్రంట్, అమెలియా కెర్, హేలీ మాథ్యూస్.. మహిళల క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లయిన ఈ త్రయం ముంబై ఇండియన్స్‌కు బలం. తమ అసాధారణ బ్యాటింగ్‌తో పాటు ప్రతీ మ్యాచ్‌లోనూ సంయ్తుకంగా 12 ఓవర్లు వేయగల నైపుణ్యం వీరి సొంతం. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు మరో ప్రధాన ఆయుధం. భారత జట్టుకు వన్డే వరల్డ్‌కప్ అందించడంతో పాటు ఇటీవలే లంకపై టీ20 సిరీస్ విజయాలతో సారథిగా తన ప్రతిభను నిరూపించుకుంది. దేశవాళీ ప్లేయర్లలో కమలిని, సజన, సంస్కృతి గుప్తా, అమన్‌జోత్ కౌర్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు.
పేస్‌లో బలహీనత
పలు అంశాల్లో ముంబై జట్టు పటిష్టంగానే కనిపిస్తున్నా పేస్ విభాగంలో మాత్రం బలహీనంగానే ఉంది. షబ్నిం ఇస్మాయిల్ రూపంలో ఒక్కరే ప్రధాన పేసర్‌గా ఉండడం గమనార్హం. పూజా వస్ర్తాకర్ వేలంలో మరో జట్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో షబ్నిం ఫామ్‌లో లేకపోయినా.. గాయపడినా ముంబైకి కష్టాలు తప్పవు. ప్రస్తుత జట్టులో ప్రభావం చూపగల షబ్నిం స్థాయి పేసర్ మరొకరు కనిపించడం లేదు. ముంబైని ఆందోళనపరిచే మరో అంశమే మిటంటే.. బౌలర్లకు మద్దతుగా ఉండేందుకు ఎక్కువగా ఆల్‌రౌండర్లపైనే ఆధారపడడం. ఈ వ్యూహం గతంలో జట్టుకు ఫలితమిచ్చినా.. సుదీర్ఘ సీజన్‌లో ఎవరైనా గాయపడితే ముంబై మరింత ఇబ్బందుల్లో పడడం ఖాయం.