యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:26 AM
భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఆడిన తొలి 33 టెస్టు మ్యాచ్‌లను 33 వేర్వేరు మైదానాల్లో ఆడిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో బరిలోకి దిగడంతో తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన తొలి 33 టెస్టు మ్యాచ్‌లను 33 వేర్వేరు మైదానాల్లో ఆడిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ రికార్డును సమం చేయగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(32 వేదికలు) రికార్డును అధిగమించాడు.
జైస్వాల్ 2023 జులై 12న వెస్టిండీస్‌తో విండ్సర్ పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆడిన ప్రతి టెస్టు మ్యాచ్‌ను వేర్వేరు వేదికల్లోనే ఆడటం విశేషం. గతంలో మంజ్రేకర్ తన తొలి 33 టెస్టులను వేర్వేరు మైదానాల్లో ఆడి ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు జైస్వాల్ కూడా అదే రికార్డును అందుకున్నాడు. ఈ ఘనతతో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కూడా జైస్వాల్ అధిగమించాడు. సచిన్ తన తొలి 32 టెస్టు మ్యాచ్‌లను వేర్వేరు వేదికల్లో ఆడాడు. ఇక భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ దినేశ్ రామ్‌దిన్ తొలి 24 టెస్టులను వేర్వేరు మైదానాల్లో ఆడి ఈ జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు.
మరో రికార్డుకు అవకాశం!
జనవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనూ అతడికి మరో అరుదైన రికార్డు సృష్టించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 21న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టులో జైస్వాల్ బరిలోకి దిగితే.. తన తొలి 34 టెస్టులను 34 వేర్వేరు వేదికల్లో ఆడిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ కూడా వేదికలుగా ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్