అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 08:09 AM
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్, 2028 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాలనే ఆలోచనలు ప్రస్తుతానికి లేవని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్, 2028 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాలనే ఆలోచనలు ప్రస్తుతానికి లేవని తెలిపాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆలోచిస్తూ కూర్చోకుండా.. ప్రస్తుతం తన ఆటపై దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తానని తెలిపాడు. అయితే షమీ ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
‘భారత జట్టులో రీఎంట్రీ విషయాన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశా. ప్రస్తుతం నా ఆటపైనే దృష్టి పెట్టాను. సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా మంచికే. నా వరకు అయితే ఫిట్నెస్ కాపాడుకుంటూ మంచి రిథమ్‌లో క్రికెట్ ఆడటం ముఖ్యం. కనీసం రాష్ట్ర జట్టు తరఫున, ఐపీఎల్‌లోనైనా ఆడుతూనే ఉండాలనుకుంటున్నా. అయితే నేను దేశవాళీ క్రికెట్ ఆడటానికి కూడా కారణాలు ఉన్నాయి. మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉన్నంతకాలం, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం ఆడుతూనే ఉండాలి. నేను ఇప్పటికీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నా. రాష్ట్ర జట్టు తరఫున ఆడుతున్నప్పుడు యువ ఆటగాళ్లు నా అనుభవం నుంచి ఏదైనా నేర్చుకోవాలని కోరుకుంటున్నా. మీరు ఏ స్థాయిలో ఆడుతున్నారన్నది ముఖ్యం కాదు. మీ అనుభవం నుంచి ఇతరులకు ఏదో ఒకటి అందించాలి’ అని షమీ వివరించాడు.
రిటైర్మెంట్తో దేశవాళీ క్రికెట్‌కు సంబంధం లేదు..
‘నేను దేశవాళీ టోర్నీలో ఆడటానికి, టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్కు ఎలాంటి సంబంధం లేదు. వైట్‌బాల్ క్రికెట్ ఆడుతూనే ఉంటానని ఇప్పటికే చెప్పా. ఫిట్నెస్ కోసం అవసరమైతే రెడ్‌బాల్ క్రికెట్ కూడా ఆడతా. గత 15-20 ఏళ్లుగా ఇదే రొటీన్‌ను అనుసరిస్తున్నా. ఇందులో కొత్తేమీ లేదు. నా శరీర పరిస్థితిని, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకునే టెస్టులకు వీడ్కోలు పలికా. అదే సరైన నిర్ణయమని అనిపించింది. ప్రస్తుతం బాగానే ఆడుతున్నా. ఇకపై వైట్‌బాల్ క్రికెట్‌ను స్వేచ్ఛగా ఆస్వాదిస్తా. శరీరంపై మరీ ఎక్కువ భారం వేయడం మంచిది కాదు’ అని షమీ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
అన్షుల్ కాంబోజ్‌కు మద్దతుగా నిలుద్దాం: బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్
వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!