అన్షుల్ కాంబోజ్‌కు మద్దతుగా నిలుద్దాం: బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:54 AM
న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి భారత జట్టు రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. దీనికి ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి భారత జట్టు రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. దీనికి ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో బౌలింగ్ వేగం తగ్గిందనే విమర్శలు ఎదుర్కొంటున్న యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు అండగా నిలిచాడు. పిచ్ స్వభావం కారణంగానే బౌలర్ల వేగం తగ్గిందని, ఈ విషయంలో కాంబోజ్‌ను ప్రత్యేకంగా తప్పుబట్టడం సరికాదని స్పష్టం చేశాడు. అతడికి మద్దతుగా నిలవాలని జట్టు సభ్యులు, అభిమానులకు సూచించాడు.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అన్షుల్ కాంబోజ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 45 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే రెండో, మూడో స్పెల్స్‌లో అతడి బౌలింగ్ వేగం గంటకు 130 కిలోమీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. బౌలింగ్‌లో వైవిధ్యం కూడా పెద్దగా కనిపించకపోవడంతో విమర్శలు వచ్చాయి. దీనిపై మోర్కెల్ స్పందించాడు. ‘అన్షుల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బయట నుంచి చూసి పరిస్థితిని అంచనా వేయడం కష్టం. రెండో రోజు తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని చూస్తే.. దాదాపు రెండు మీటర్ల ఎత్తులో బౌలింగ్ చేస్తున్న బౌలర్‌కు వికెట్ కీపర్ స్టంప్స్‌కు దగ్గరగా నిలబడాల్సిన పరిస్థితి కనిపించింది. అది ఆందోళన కలిగించే విషయం.
బౌలింగ్‌లో వేగం తగ్గిందనే విషయంలో అన్షుల్‌ను ప్రత్యేకంగా తప్పుబట్టడం అన్యాయం. అతడు జట్టుకు నియంత్రణ అందించాడు. జట్టు కోసం కష్టమైన ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. మనం అతడికి అండగా నిలవాలి. మ్యాచ్ ఆరంభంలోనే పిచ్ వేగాన్ని కోల్పోయింది. అందువల్ల బౌలర్ల వేగం కూడా తగ్గింది. టెస్టు క్రికెట్‌లో పిచ్‌లు ఫ్లాట్‌గా మారడం సహజమే. అయితే వాటి నుంచి బౌన్స్, వేగం పూర్తిగా తగ్గిపోకూడదు. కొత్త బంతితో వీలైనన్ని వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి. కొన్ని సందర్భాల్లో ధైర్యంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది’ అని మోర్కెల్ వివరించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ లక్ష్యంగా..
మహమ్మద్ సిరాజ్‌ను తొలి టెస్టు జట్టు నుంచి తప్పించడంపై కూడా మోర్కెల్ స్పందించాడు. ‘సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. అతడితో నేను మాట్లాడాను. కొంతకాలం వెనక్కి తగ్గి, మనం ఎక్కడ మెరుగుపడాలో పరిశీలించుకుందామని చెప్పాను. జట్టు ఎంపిక అనేది మన నియంత్రణలో ఉండదు. యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కూడా తన ప్రదర్శనలతో జట్టులో చోటు కోసం గట్టి పోటీ ఇస్తున్నాడు. అవకాశం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. అతడిని 100 శాతం ఫిట్‌గా, సిద్ధంగా ఉంచడం నా బాధ్యత. భారత ప్లేయర్లు అందరూ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలని కోరుకుంటున్నారు. గెలుపొటములను పట్టించుకోకుండా.. ఒక్కో సెషన్‌ను విడివిడిగా విశ్లేషించుకుని అత్యుత్తమ క్రికెట్ ఆడటంపై దృష్టి పెట్టాలి’ అని మోర్కెల్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
మహిళల బిగ్‌బాష్ లీగ్: ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ ఔట్.. వీడియో వైరల్
ఆట హాస్యాస్పదంగా మారింది.. వైభవ్ ఇన్నింగ్స్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు