Share News

వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!

ABN , Publish Date - Nov 26 , 2026 | 09:59 AM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. వైభవ్ డబుల్ సెంచరీపై క్రికెట్ ఐస్‌లాండ్ ఎక్స్ వేదికగా ఫన్నీ పోస్ట్ పెట్టింది.

వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్?.. ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్!
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ 53 బంతుల్లోనే 204 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై క్రికెట్ ఐస్‌లాండ్ ఎక్స్ వేదికగా ఫన్నీ పోస్ట్ పెట్టింది. వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్ ఉన్నాయేమో అంటూ ఆ సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్‌ను ప్రస్తావిస్తూ సెటైర్ వేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


చైనా గూఢచారిగా భావిస్తున్న ఓ మహిళతో హువాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేశాడు. అయితే 11 రోజులు తిరగక ముందే సీఈఓగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. గతంలో కూడా ఐస్‌లాండ్ క్రికెట్ పలుమార్లు వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్స్ ఉన్నట్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.


‘సోమవారం జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈఓగా బాధ్యతలు చేపట్టడం.. మంగళవారం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం యాదృఛ్చికం కాదేమో అనిపిస్తోంది. వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్ ఉన్నాయా? హువాంగ్ తిరిగి రాగానే మళ్లీ అవి పని చేయడం మొదలుపెట్టాయా?’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. వైభవ్ బ్యాటింగ్ వేగం, సిక్సర్ల వర్షాన్ని ఏఐ చిప్స్‌తో పోలుస్తూ చేసిన ఈ పోస్టు క్రికెట్ అభిమానులను నవ్విస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.


పోలికలు ఆపండి.. ఆడనివ్వండి: గంగూలీ

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా వైభవ్ ప్రతిభను ప్రశంసించాడు. ‘వైభవ్ మంచి ఆటగాడు. అతడిలో అపారమైన ప్రతిభ ఉంది. భారత జట్టు తరఫున వచ్చిన అవకాశాలను కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడు భారత క్రికెట్ భవిష్యత్తు. అతడిని ఎవరితోనూ పోల్చవద్దు. తనదైన శైలిలో ఆడనివ్వండి. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్. వయసు కేవలం 15-16 ఏళ్లు మాత్రమే. ఇంకా ఎంతో క్రికెట్ ఆడాల్సి ఉంది. అతడికి తగిన సమయం ఇవ్వాలి’ గంగూలీ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

మహిళల బిగ్‌బాష్ లీగ్: ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ ఔట్.. వీడియో వైరల్

ఆట హాస్యాస్పదంగా మారింది.. వైభవ్ ఇన్నింగ్స్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Nov 26 , 2026 | 09:59 AM