Share News

బౌలింగ్‌లో విఫలమయ్యాం.. శ్రీలంక చేతిలో ఓటమిపై స్పందించిన తిలక్ వర్మ!

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:42 AM

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్లో భారత్-ఎ ఓటమిపై కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయామని అంగీకరించాడు.

బౌలింగ్‌లో విఫలమయ్యాం.. శ్రీలంక చేతిలో ఓటమిపై స్పందించిన తిలక్ వర్మ!
Tilak Varma

ఇంటర్నెట్ డెస్క్: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్లో భారత్-ఎ ఓటమిపై కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయామని అంగీకరించాడు. భారత్-ఏ జట్టు తొలుత బ్యాటింగ్‌లో 317 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయింది. 318 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో భారత్-ఎ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


‘శ్రీలంక ఓపెనర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇద్దరూ అద్భుతంగా ఆడారు. నేను అందుబాటులో ఉన్న బౌలర్లందరినీ ప్రయత్నించాను. కానీ బౌలింగ్‌లో మాకు ఇది బ్యాడ్ డే. ఒక్కోసారి ఇలాంటి రోజులు ఎదురవుతుంటాయి. శ్రీలంక బ్యాటర్లకు అభినందనలు. ఛేదనలో తొలి 15 ఓవర్లు అత్యంత కీలకమని ముందే అంచనా వేశా. ఆ సమయంలో ఓవర్‌కు ఆరు పరుగుల లోపే కట్టడి చేస్తే.. ఆ తర్వాత పిచ్ నెమ్మదించి బౌలర్లకు సహకరిస్తుందని భావించా. అయితే ప్రణాళికలను మైదానంలో అమలు చేయడంలో విఫలమయ్యాం. పిచ్ స్వభావాన్ని బట్టి 318 పరుగులు మంచి స్కోరే అనిపించింది. కానీ ఆ స్కోరును మేము కాపాడుకోలేకపోయాం’ అని తిలక్ వర్మ వెల్లడించాడు.


కుర్రాళ్ల ప్రదర్శనపై తిలక్ సంతృప్తి!

ఫైనల్‌కు చేరుకోలేకపోయినా జట్టులోని యువ ఆటగాళ్ల ప్రదర్శన సానుకూల అంశమని తిలక్ పేర్కొన్నాడు. ‘జట్టులో చాలామంది యువ ఆటగాళ్లు తొలిసారి ఆడుతున్నారు. షహబాజ్, తనుష్ వంటి ఆటగాళ్ల ప్రదర్శన సంతోషాన్నిచ్చింది. షహబాజ్ దిగువ వరుసలో బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్‌లోనూ రాణించాడు. తనుష్ కూడా మంచి ఆల్‌రౌండర్. బ్యాటింగ్‌లో మేం బాగానే రాణించాం. కానీ బౌలింగ్‌లో ఎక్కడ తప్పు జరిగిందో డ్రెస్సింగ్ రూమ్‌లో సమీక్షించుకుంటాం. మరింత బలంగా తిరిగి వస్తాం’ అని తిలక్ వర్మ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్

Updated Date - Nov 27 , 2026 | 09:42 AM