Share News

డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:55 PM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2027 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌ల వేదికను మార్చింది. తొలుత ఈ మ్యాచ్‌లను బ్రబోర్న్‌ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా వాంఖడే స్టేడియానికి మార్చినట్లు ప్రకటించింది.

డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ
BCCI

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌ల వేదికను మార్చింది. తొలుత ఈ మ్యాచ్‌లను బ్రబోర్న్‌ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా వాంఖడే స్టేడియానికి మార్చినట్లు ప్రకటించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు డబ్ల్యూపీఎల్‌ 2027 జరగనుంది. ఈ టోర్నీకి వడోదర, ముంబై ఆతిథ్య నగరాలుగా వ్యవహరించనున్నాయి. జనవరి 14 నుంచి 24 వరకు వడోదరలోని బీసీఏ స్టేడియంలో తొలి దశ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం జనవరి 26 నుంచి ఫిబ్రవరి 7 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మిగతా మ్యాచ్‌లు నిర్వహిస్తారు.


వాస్తవానికి డబ్ల్యూపీఎల్‌ ముంబై దశ మ్యాచ్‌లకు క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (CCI)కి చెందిన బ్రబోర్న్‌ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు. అయితే ఇదే స్టేడియంలో ఫిబ్రవరి 14 నుంచి తొలిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. దీంతో డబ్ల్యూపీఎల్‌ ముగిసిన వెంటనే మరో అంతర్జాతీయ టోర్నీ ప్రారంభమైతే పిచ్‌లను సిద్ధం చేయడానికి తగినంత సమయం ఉండదని బీసీసీఐ భావించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చేసిన విజ్ఞప్తి మేరకు వేదికను మార్చినట్లు బోర్డు వెల్లడించింది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) కూడా తన 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భవిష్యత్తులో షెడ్యూల్‌లో మార్పులు జరిగితే వాంఖడే స్టేడియాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐని కోరింది.


11 మ్యాచ్‌లకు వాంఖడే ఆతిథ్యం

ఈ మార్పుపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూపీఎల్‌ ఐదో సీజన్‌లో ముంబై దశకు సంబంధించిన లీగ్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌, ఫైనల్‌ సహా మొత్తం 11 మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంలోనే జరుగుతాయని స్పష్టం చేసింది. వేదిక మాత్రమే మారిందని.. మ్యాచ్‌ల తేదీలు, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపింది. సెప్టెంబర్‌ 15, 2026న జరిగిన సమావేశంలో డబ్ల్యూపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తొలుత వేదికలు, తేదీలను ఖరారు చేసింది. తాజాగా ఐసీసీ విజ్ఞప్తి, పిచ్‌ల నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పునకు ఆమోదం తెలిపింది.


ఇవి కూడా చదవండి:

ఐదో వన్డేలో కివీస్‌పై విజయం.. సిరీస్ టీమిండియాదే

49 ఏళ్లయినా నాతోనే.. తన తొలి బ్యాట్‌పై సచిన్ టెండూల్కర్ స్పెషల్ పోస్ట్!

Updated Date - Nov 15 , 2026 | 05:56 PM