49 ఏళ్లయినా నాతోనే.. తన తొలి బ్యాట్‌పై సచిన్ టెండూల్కర్ స్పెషల్ పోస్ట్!
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:03 PM
తన తొలి క్రికెట్ బ్యాట్‌తో ఉన్న అనుబంధాన్ని సచిన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 37 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను మళ్లీ రీక్రియేట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి నవంబర్ 15తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోజిది. ఈ సందర్భంగా తన తొలి క్రికెట్ బ్యాట్‌తో ఉన్న అనుబంధాన్ని సచిన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 37 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను మళ్లీ రీక్రియేట్ చేశాడు. చిన్నప్పుడు ఏ బ్యాట్‌తో ఫొటో దిగారో.. అదే బ్యాట్‌ను చేతిలో పట్టుకుని తాజాగా మరో ఫొటో దిగాడు. ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
‘ఇదే నా తొలి బ్యాట్.. 49 ఏళ్లు గడిచినా ఇది నాతోనే ఉంది’ అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 37 ఏళ్ల క్రితం నవంబర్ 15న పాకిస్థాన్‌తో కరాచీలో జరిగిన మ్యాచ్‌తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటికి అతడి వయసు 16 ఏళ్ల 205 రోజులు మాత్రమే. సచిన్ క్రికెట్ ప్రయాణం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. పొడవాటి జుట్టుతో, చేతిలో బ్యాట్ పట్టుకుని బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న చిన్ననాటి ఫొటో గుర్తుకొస్తుంది. క్రికెట్‌పై చిన్నతనం నుంచే ఆయనకున్న మక్కువకు ఈ చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు దశాబ్దాలు గడిచినా అదే బ్యాట్‌ను భద్రంగా ఉంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
రికార్డుల రారాజు.. సచిన్
సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో సచిన్ ఎన్నో అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 34,357 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ రికార్డు ఇప్పటికీ భద్రంగా ఉంది. ఇక ఇదే రోజున అంతర్జాతీయంగా చివరిసారి సచిన్ బ్యాటింగ్ చేశాడు. ఇక అంతర్జాతీయంగా వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సచిన్ పేరిటే ఉంది. ఇందులో 49 వన్డే, 51 టెస్టు సెంచరీలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..