భారత యువ జట్టుపై విమర్శలు.. అండర్ 19 ఆసియా కప్ హీరో రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:31 PM
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించిన తర్వాత భారత యువ క్రికెటర్లు చేసిన సంబరాలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై భారత యువ బ్యాటర్ మోహిత్ ఉల్వా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించిన తర్వాత భారత యువ క్రికెటర్లు చేసిన సంబరాలు తీవ్ర చర్చకు దారితీశాయి. పాక్ ఆటగాళ్లవైపు వెళ్తూ భారత ఆటగాళ్లు విజయోత్సాహాన్ని ప్రదర్శించడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఆఖరి బంతికి బౌండరీ బాది గెలిపించిన భారత యువ ప్లేయర్ మోహిత్ ఉల్వా స్పందించాడు. తమ సంబరాల వెనుక ప్రత్యర్థులను కవ్వించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
‘అది భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. పైగా ఫైనల్ పోరు. అలాంటి మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి గెలిచినప్పుడు మా ఎమోషన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. మా భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉన్నాయి. వాళ్లను కవ్వించాలనే ఉద్దేశం మాకెవరికీ లేదు. కేవలం మేం సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాం. ఆ క్షణంలో ఎలా అనిపించిందో అలాగే సంబరాలు చేసుకున్నాం. గ్రూప్ దశలో పాకిస్థాన్ మాపై విజయం సాధించింది. అప్పుడు వాళ్లు కూడా ఇలాగే సంబరాలు చేసుకున్నారు. అయినప్పటికీ వాటికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మా జట్టులో ఎవరూ దాన్ని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడం అత్యంత సహజం’ అని మోహిత్ ఉల్వా వివరించాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు..
‘చివరి బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో ఆఖరి బంతిని బౌండరీకి బాదాను. ఆ తర్వాత పూర్తిగా మరో లోకంలోకి వెళ్లిపోయాను. చుట్టూ ఏం జరుగుతోంది? అందరూ నా దగ్గరకు ఎందుకు పరుగెత్తుకొస్తున్నారు? అనేది కూడా వెంటనే అర్థం కాలేదు. మ్యాచ్ ముగిసే వరకు గెలిపించగలననే నమ్మకంతోనే ఉన్నాను. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత నిజంగానే గెలిచామా? అని నమ్మలేకపోయాను. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత సహచరులు తనను పైకి ఎత్తుకుని సంబరాలు చేసుకుంటున్నప్పుడు అసలు విషయం అర్థమైంది. రోజంతా అక్కడే ఉండి మాకు మద్దతుగా నిలిచిన భారత అభిమానుల దగ్గరకు వెళ్లి వారితో కలిసి సంబరాలు చేసుకున్నా. ఆ అనుభూతి అద్భుతం. ఇప్పటికీ ఆ ఆనందం అలాగే ఉంది. నా కుటుంబం కోసం, నా దేశం కోసం, భారత్ కోసం ఇలాంటి మ్యాచ్‌లో విజయం సాధించడం ఎవరికైనా ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని మోహిత్ ఉల్వా వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఐదో వన్డేలో కివీస్‌పై విజయం.. సిరీస్ టీమిండియాదే
49 ఏళ్లయినా నాతోనే.. తన తొలి బ్యాట్‌పై సచిన్ టెండూల్కర్ స్పెషల్ పోస్ట్!