Share News

మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:25 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సిపై ప్రశంసలు కురిపించాడు.

మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఐలో ఉన్న అర్జెంటీనా జట్టు అల్జీరియాతో తలపడనుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఫిఫా ప్రపంచ కప్ మెస్సికి ఆఖరిదంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో మెస్సిని మైదానంలో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న మెస్సి.. పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సిపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ మొత్తం మెస్సి కోసం ఎదురుచూస్తోందని తెలిపాడు.


‘అర్జెంటీనా అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం మెస్సిని మైదానంలో చూడాలని కోరుకుంటోంది. అతడు కేవలం మా జట్టుకే కాదు ప్రపంచ ఫుట్‌బాల్‌కే ప్రత్యేక ఆకర్షణ. అతడి గురించి ప్రతికూలంగా చెప్పడానికి ఏమీ లేదు. మెస్సి ఎప్పుడూ జట్టుకు అండగా నిలిచాడు. జట్టు విజయాల్లో అతడి పాత్రే అత్యంత కీలకం. మెస్సి ఫుట్‌బాల్ దేవుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’ అని స్కలోని వెల్లడించాడు.


ఇదిలా ఉండగా, ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2022 టైటిల్‌ను అర్జెంటీనా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. మెస్సి సహచరుడు నికోలస్ ఒటమెండీ ఈ సందర్భంగా మాట్లాడాడు. ‘ఖతార్‌లో సాధించిన విజయం దేశాన్ని ఒక్కటిగా నిలిపింది. ఆ జ్ఞాపకాలు మాకు మరింత బలాన్నిస్తున్నాయి. అదే పట్టుదలతో మళ్లీ బరిలోకి దిగనున్నాం. అయితే మెస్సితో కలిసి ఆడటం నాకు గర్వంగా అనిపిస్తుంటుంది. అతడు సాధారణ వ్యక్తి కాదు.. మైదానంలో మెస్సి ఓ యోధుడు’ అని పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?

ఉత్కంఠభరితంగా సాగిన బెల్జియం, ఈజిప్ట్‌ల మ్యాచ్

Updated Date - Jun 16 , 2026 | 02:37 PM