Share News

ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ 2026: సెమీస్‌కు చేరిన భారత్

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:23 PM

ఎఫ్ ఐహెచ్ నేషన్స్‌ కప్‌ మహిళల హాకీ2026 టోర్నమెంట్లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఆక్లాండ్‌లో జరిగిన పూల్- ఎ మ్యాచ్‌లో భారత్‌ 2-1 తేడాతో జపాన్‌ను ఓడించింది.

ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ 2026: సెమీస్‌కు చేరిన భారత్

స్పోర్ట్స్ డెస్క్: ఎఫ్ ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్‌ కప్‌ 2026 టోర్నమెంట్లో భారత్‌ సెమీస్‌కు చేరింది. ఇవాళ(మంగళవారం) ఆక్లాండ్‌ నగరంలోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్‌లో జరిగిన పూల్- ఎ మ్యాచ్‌లో భారత్‌ 2-1 తేడాతో జపాన్‌ను ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ సలీమా టెటే 33వ నిమిషంలో, ఫార్వర్డ్ లాల్‌రెమ్‌సియామి 49వ నిమిషంలో గోల్స్ చేశారు. ప్రత్యర్థి జట్టులో హిరామిట్సు 35వ నిమిషంలో గోల్ చేసింది.


తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు కూడా కొంతసేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని, గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నాయి. అయితే విరామ సమయం వరకు కూడా ఏ జట్టు గోల్ చేయలేదు. మూడవ క్వార్టర్‌లో భారత్ పెనాల్టీ కార్నర్ వ్యూహాన్ని చక్కగా అమలు చేసి గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. 33వ నిమిషంలో నవనీత్ కౌర్ కొట్టిన షాట్‌ను నిక్కీ ప్రధాన్ చాకచక్యంగా కెప్టెన్ సలీమా వైపునకు మళ్లించింది. ఆమె వెంటనే సమీపం నుంచి గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. జపాన్ కూడా దాదాపు వెంటనే స్పందించింది. రెండు నిమిషాల తర్వాత అంటే 35వ నిమిషయంలో హిరామిట్సు పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును సమం చేసింది.


ఆఖరి పావుగంటలో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండగా, 49వ నిమిషంలో ఫార్వర్డ్ లాల్‌రెమ్‌సియామి గోల్ కొట్టి.. భారత్ ను మరోసారి ఆధిక్యంలో నిలిపింది. ఆట చివరి దశలలో స్కోరును సమం చేసేందుకు జపాన్ ప్లేయర్లు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలు సాధించి పూల్- ఎలో 6 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉండటమే కాకుండా సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. జూన్ 18న జరిగే తమ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో ఉరుగ్వేతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?

ఉత్కంఠభరితంగా సాగిన బెల్జియం, ఈజిప్ట్‌ల మ్యాచ్

Updated Date - Jun 16 , 2026 | 01:26 PM