Share News

మ్యాచ్ డ్రా.. విచిత్రంగా సంబరాలు చేసుకున్న ఇరాన్ ప్లేయర్!

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:32 AM

ఫిఫా ప్రపంచకప్ 2026 ప్ర‌యాణాన్ని ఇరాన్ జట్టు డ్రాతో ఆరంభించింది. గ్రూప్‌-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదిక‌గా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది.

మ్యాచ్ డ్రా.. విచిత్రంగా సంబరాలు చేసుకున్న ఇరాన్ ప్లేయర్!
Iran vs New Zealand

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూజిలాండ్‪తో జరిగిన మ్యాచ్‍ను ఇరాన్ డ్రా చేసుకుంది. గ్రూప్‌-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదిక‌గా జరిగిన ఈ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఇరాన్ తరఫున 32వ నిమిషంలో రమిన్ రిజెయిన్, 64వ నిమిషంలో మహమ్మద్ మొహెబి గోల్ కొట్టగా, న్యూజిలాండ్ తరఫున ఎలిజా జస్ట్‌ డబుల్ గోల్స్‌తో మెరిశాడు. అతడు 7వ, 55వ నిమిషంలో గొల్స్ కొట్టాడు. ఈ మ్యాచ్ డ్రా కావ‌డంతో ఇరుజ‌ట్లు చెరో పాయింట్ గెలుచుకున్నాయి.


ఎన్నో ఉత్కంఠ ప‌రిణామాల న‌డుమ ఫిఫా ఆడేందుకు అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ త‌న స్థాయికి త‌గ్గ ఆట‌తీరును ప్రద‌ర్శించింద‌ని క్రీడా నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ లో ఇరాన్ ప్లేయ‌ర్ మహ‌మ్మద్ మొహెబి చ‌ర్య వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ రెండో గోల్ కొట్టి ఉత్సాహంగా ఉంది. ఈ స‌మ‌యంలో న్యూజిలాండ్ డిఫెన్స్ టీమ్‌ను దాటుకొని 64వ నిమిషంలో మొహెబి కార్నర్ నుంచి బంతిని నేరుగా గోల్ పోస్టులోకి తర‌లించాడు. అనంతరం అత‌డు త‌న చేతిని తుపాకీగా మార్చుకొని గాల్లోకి కాల్పులు జ‌రుపుతున్నట్లుగా ఫోజు ఇస్తూ సంబరం చేసుకున్నాడు. అత‌డి చ‌ర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి సెల‌బ్రేష‌న్‌పై కొంత‌మంది ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు.


స్టేడియంలో అమెరికాకు చెందిన వాళ్లు కూడా ఉండ‌డంతో వాళ్లు వైపు చూస్తూ మహ‌మ్మద్ ఈ తరహా సెలబ్రేషన్ చేశాడని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆట‌కు రాజ‌కీయాలతో సంబంధం లేద‌ని ఇరాన్ ఫుట్‌బాల్ జ‌ట్టు పేర్కొంది. ఇక మ్యాచ్‌ ముగిసిన వెంటనే అమెరికా అధికారులు ఇరాన్‌ జట్టును తమ దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారని సమాచారం. దీనిపై ఇరాన్‌ కోచ్‌ ఆమీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాసేపు కూడా విశ్రాంతి తీసుకోనివ్వరా అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ తమ బేస్‌ క్యాంప్‌ను మెక్సికోకు తరలించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

భారత్, శ్రీలంక వివాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య

Updated Date - Jun 16 , 2026 | 12:31 PM