Share News

ఈ-20 పెట్రోల్‌ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్‌!

ABN , Publish Date - Jun 16 , 2026 | 06:02 AM

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగానికి అనువుగాలేని వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ను వినియోగిస్తే.. వాహనబీమా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ అతిపెద్ద బీమా సంస్థ...

ఈ-20 పెట్రోల్‌ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్‌!

  • తమ బ్లాగ్‌లో పోస్ట్‌ చేసిన ఐసీఐసీఐ లాంబార్డ్‌ బీమా సంస్థ

  • కలకలం రేగడంతో ప్రకటన వెనక్కి!

న్యూఢిల్లీ, జూన్‌ 15: ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగానికి అనువుగాలేని వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ను వినియోగిస్తే.. వాహనబీమా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ అతిపెద్ద బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ తమ బ్లాగ్‌లో పెట్టిన పోస్టు కలకలం రేపింది. 2023కు ముందునాటి వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ వినియోగించడం నిర్లక్ష్యం కింద పరిగణించే అవకాశం ఉందని ఈ నెల 9న పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ-20 (20శాతం ఇథనాల్‌ కలిపిన) పెట్రోల్‌ విక్రయిస్తుండటం, దీనితో వాహనాల ఇంజన్లపై ప్రభావం ఉంటుందని, మైలేజీ తగ్గుతుందని నిపుణులు చెబుతుండటం నేపథ్యంలో దీనిపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో తాజాగా తమ బ్లాగ్‌లోని పోస్టును సవరించి, వివరణ ఇచ్చింది. ‘‘పాత వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ వినియోగాన్ని నిర్లక్ష్యం కింద పరిగణించబోమని స్పష్టత ఇస్తున్నాం. సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ తదితర ఇంధనాలు వాడే వాహనాలకు ఏ విధంగా బీమా క్లెయిమ్‌ వర్తిస్తుందో.. ఈ-20 పెట్రోల్‌ వినియోగించే వాహనాలకూ అదే విధంగా క్లెయిమ్‌ వర్తిస్తుంది. కేవలం వినియోగించే ఇంధనం ఆధారంగా క్లెయిములను తిరస్కరించం’’ అని స్పష్టం చేసింది.

సుదీర్ఘకాలంలో జరిగే నష్టానికి

బీమా తిరస్కరించే చాన్స్‌?

బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్న ప్రకారం.. వాహనాల బీమాలో ఇంజన్‌ ప్రొటెక్షన్‌ యాడ్‌ ఆన్‌ను చేర్చుకుంటే.. ఇంజన్‌లోకి నీరు చేరడం, ఆయిల్‌ లీకవడం, యాంత్రికపరమైన వైఫల్యం వంటివి మాత్రమే కవర్‌ అవుతాయని, ఇంధనం కారణంగా దెబ్బతింటే యాడ్‌ ఆన్‌ వర్తించదని ఐసీఐసీఐ లాంబార్డ్‌ స్పష్టం చేయడం గమనార్హం. అంటే ప్రమాదాలు, దొంగతనం వంటివి జరిగినప్పుడు బీమా వర్తించడంలో ఎలాంటి తేడాలు ఉండవు. కానీ పాత, ఈ-20 పెట్రోల్‌ వినియోగానికి అనువుగా రూపొందించని వాహనాల్లో.. ఈ-20 పెట్రోల వాడటం వల్ల సుదీర్ఘకాలంలో ఇంజన్‌ వైఫల్యం, విడిభాగాలు దెబ్బతినడం వంటివి జరిగినప్పుడు మాత్రం బీమా తిరస్కరించే అవకాశం ఉంటుందని.. ఇంజన్‌ ప్రొటెక్షన్‌ యాడ్‌ ఆన్‌ తీసుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 06:02 AM