భారత్‌పై భారీ ఛేజ్.. విండీస్ కెప్టెన్ హోప్ ఖాతాలో పలు రికార్డులు
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:49 AM
భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 250 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హోప్‌తో పాటు విండీస్ జట్టు పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ స్కోరు చేసినా భారత్‌కు విజయం దక్కలేదు. బ్యాటర్లు పరుగుల వరద పారించినా.. బౌలర్లు మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కెప్టెన్ షై హోప్ (102 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్ రికార్డు ఛేదనతో అదరగొట్టింది. 250 పరుగుల టార్గెట్‌ను 18.3 ఓవర్లలోనే ఊదేసింది. ఈ మ్యాచ్‌లో హోప్‌తో పాటు విండీస్ జట్టు పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే సెంచరీ చేసిన షై హోప్.. భారత్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సంయుక్తంగా అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌పై ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ కూడా 45 బంతుల్లోనే శతకం బాదాడు.
వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా హోప్ నిలిచాడు. ఈ జాబితాలో జాన్సన్ చార్లెస్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2023లో దక్షిణాఫ్రికాపై అతడు కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో వెస్టిండీస్ బ్యాటర్‌గా హోప్ నిలిచాడు. క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ ఇప్పటికే ఈ ఘనత సాధించారు.
భారత్‌పై 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా వెస్టిండీస్ పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన అత్యధిక విజయవంతమైన ఛేదనను నమోదు చేసింది. 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 236/6 పరుగులు చేసి గెలిచిన రికార్డును అధిగమించింది.
పురుషుల టీ20ల్లో అత్యధిక లక్ష్య ఛేదనల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. 2023లో సెంచూరియన్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అగ్రస్థానంలో ఉంది.
రాంచీ టీ20లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగుల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. 2023లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 517 పరుగులు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో మొత్తం 79 బౌండరీలు నమోదయ్యాయి. పురుషుల టీ20ల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు నమోదైన జాబితాలో ఇది మూడో స్థానంలో ఉంది. 2023లో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్‌లో 81 బౌండరీలు నమోదవగా.. 2025లో జిబ్రాల్టర్-బల్గేరియా మ్యాచ్‌లో 80 బౌండరీలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు