శాండ్పేపర్ వివాదం.. ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలను ఖండించిన వసీం అక్రమ్!
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:48 PM
శాండ్పేపర్ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన ఆరోపణలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన శాండ్పేపర్ వివాదం గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆటగాళ్లందరికీ ఈ బాల్ ట్యాంపరింగ్ గురించి ముందే తెలుసంటూ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ప్రస్తావించిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై పలువురు ఆసీస్ క్రికెటర్లు ఇప్పటికే స్పందించి తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఖవాజా ఆరోపణలను ఖండించిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ గురించి తమకేం తెలియదంటూ స్పష్టం చేశాడు. కమిన్స్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు బాల్ ట్యాంపర్ అయిందా లేదా అని ఇట్టే పసిగట్టగలరని తెలిపాడు.
‘ప్యాట్ కమిన్స్ నాకు మంచి స్నేహితుడు. ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆటగాడు, నాయకుడు. అయితే బాల్ ట్యాంపరింగ్ గురించి తనకు తెలియదని చెప్పడం మాత్రం సరైనదిగా అనిపించలేదు. బహుశా ఆ సమయంలో జట్టులోని అందరికీ ఏం జరుగుతుందో తెలియకపోయి ఉండొచ్చు. ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే. కానీ ఒక అనుభవజ్ఞుడైన బౌలర్ చేతికి బంతి వస్తే.. దాన్ని స్వభావాన్ని సులువుగా పసిగట్టగలరు. బంతి నా చేతిలోకి వచ్చినప్పుడు అది ఐదో ఓవర్ అయినా, పదో ఓవర్ అయినా, 50వ ఓవర్ అయినా దాని పరిస్థితిని గమనిస్తాను. పొడి వాతావరణంలో బంతిని ఒక్కసారి నేలపైకి విసిరితే చిన్న గీతలు పడవచ్చు. కానీ శాండ్పేపర్తో రుద్దడం వల్ల ఏర్పడే గీతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. బంతిపై ఏదో సరిగ్గా లేదని వెంటనే గుర్తించగలం.
ఈ వివాదంపై అభిమానులు స్వయంగా తెలుసుకోవాలంటే సెమీ న్యూ క్రికెట్ బంతిని తీసుకుని దానిపై శాండ్పేపర్తో రుద్దండి. అప్పుడు ఏర్పడే గీతలు, సహజంగా బంతికి పడే గీతల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నేను ఎవరి పక్షానా మాట్లాడటం లేదు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మైదానంలో చాలా గొప్పగా ఆడటంతో పాటు నిజాయతీకి కూడా పేరుగాంచారు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇక ఇప్పుడైనా ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆశిస్తున్నా’ అని వసీం అక్రమ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్పింగ్, పుతిన్ కీలక భేటీ..
పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..