బుమ్రా కాదు.. ఆ స్టార్ ప్లేయర్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 10:38 AM
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై అధికంగా ఉండే వర్క్‌లోడ్‌ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై అధికంగా ఉండే వర్క్‌లోడ్‌ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు. గాయాలు ఆటలో భాగమేనని, అయితే వాటి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ను మెరుగ్గా నిర్వహించుకోవాలని సూచించాడు. ఇటీవల పలువురు భారత ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సీఓఈని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న రిహాబిలిటేషన్, ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ను సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ నితీశ్ విషయంలో సీఓఈ అనుసరిస్తున్న విధానాన్ని వివరించాడు.
నితీశ్ ఇటీవల తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే సిరీస్‌లకు అతడు దూరమైన సంగతి తెలిసిందే. ‘ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై ఎక్కువ వర్క్‌లోడ్ ఉంటుంది. మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలోనే కాకుండా, జట్టులో లేని విరామ సమయాల్లోనూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. గాయాలు ఆటలో భాగమే. అయితే ఆల్‌రౌండర్‌గా తనపై ఉన్న భారాన్ని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో అతడు తెలుసుకోవాలి. ప్రస్తుతం క్రికెట్‌లో ప్లేయర్లకు పెద్దగా ఆఫ్-సీజన్ ఉండటం లేదు. ఐపీఎల్, రాష్ట్ర జట్టు తరఫున క్రికెట్ ఆడటం, దేశవాళీ టోర్నీలు, అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఆటగాళ్లు బిజీగా ఉంటున్నారు. అందువల్ల మ్యాచ్‌ల మధ్య లభించే స్వల్ప విరామాలను ఫిట్‌నెస్ మెరుగుపర్చుకునేందుకు సమర్థంగా వినియోగించుకోవాలి’ అని లక్ష్మణ్ సూచించాడు.
సీజన్‌కు ముందు ప్రత్యేక ఫిట్‌నెస్ పరీక్షలు..
సీజన్ ప్రారంభానికి ముందు కాంట్రాక్ట్ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తులో జట్టుకు ఎంపికయ్యే క్రికెటర్లకు పలు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపాడు. నేషనల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ క్రైటీరియా (NFTC)లో భాగంగా వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పాడు. తాజాగా టీమిండియా స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రూక్స్ సూచనతో ‘బ్రోంకో టెస్ట్’ను కూడా ప్రవేశపెట్టినట్లు వెల్లడించాడు. అయితే సిరీస్ జరుగుతున్న సమయంలో యో-యో టెస్ట్ నిర్వహించడం సాధ్యం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశాడు. యో-యో టెస్ట్ ఆటగాళ్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని వివరించాడు. దీనికి బదులుగా బ్రోంకో టెస్ట్‌ను కండిషనింగ్ సెషన్‌గా ఉపయోగించవచ్చని, తద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయులను కూడా అంచనా వేయొచ్చని చెప్పాడు. నితీశ్ విషయంలోనే కాకుండా అన్ని ఆటగాళ్ల విషయంలోనూ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై సీఓఈ దృష్టి పెడుతోందని లక్ష్మణ్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!