Share News

షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అభిషేక్ శర్మ, గిల్.. ఏ జట్ల తరఫున ఆడనున్నారంటే?

ABN , Publish Date - Aug 09 , 2026 | 07:33 PM

పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్‌-ఇ-పంజాబ్‌ టీ20 లీగ్‌కు స్టార్‌ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, యువ సంచలనం అభిషేక్‌ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు.

షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అభిషేక్ శర్మ, గిల్.. ఏ జట్ల తరఫున ఆడనున్నారంటే?
Share-E-Punjab T20 League

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్‌-ఇ-పంజాబ్‌ టీ20 లీగ్‌కు స్టార్‌ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, యువ సంచలనం అభిషేక్‌ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు. దీంతో తొలి సీజన్‌లోనే ఈ లీగ్‌కు భారీ క్రేజ్‌ లభించింది. గిల్‌ ఫజిల్కా ఫాల్కన్స్‌ తరఫున బరిలోకి దిగనుండగా.. అభిషేక్‌ శర్మ అమృత్‌సర్‌ సూర్మాస్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వీరితో పాటు స్టార్ ప్లేయర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌లు కూడా మార్కీ ప్లేయర్లుగా వివిధ జట్లకు ఎంపికయ్యారు.


మార్కీ ప్లేయర్లు.. జట్లు ఇవే

  • శుభ్‌మన్‌ గిల్‌ – ఫజిల్కా ఫాల్కన్స్‌

  • అభిషేక్‌ శర్మ – అమృత్‌సర్‌ సూర్మాస్‌

  • అర్ష్‌దీప్‌ సింగ్‌ – లూధియానా లయన్స్‌

  • ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ – జలంధర్‌ వారియర్స్‌

  • రమణ్‌దీప్‌ సింగ్‌ – మొహాలీ కింగ్స్‌

  • గుర్నూర్‌ బ్రార్‌ – భటిండా రాయల్స్‌


ఆరు జట్లతో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 27 మ్యాచ్‌లు ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్‌లోని పీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. పంజాబ్‌ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ లీగ్‌ ప్రధాన లక్ష్యమని పీసీఏ పేర్కొంది. తన స్వస్థలం ఫజిల్కాకు చెందిన గిల్‌ కూడా ఈ టోర్నీపై ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్‌ ఎప్పటినుంచో గొప్ప క్రికెటర్లను భారత జట్టుకు అందిస్తోంది. ఈ లీగ్‌ ద్వారా మరింత మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని నమ్ముతున్నా’ అని గిల్‌ తెలిపాడు.


అదే లక్ష్యం..

షేర్‌-ఇ-పంజాబ్‌ టీ20 లీగ్‌లో రౌండ్‌ రాబిన్‌ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో ఫ్రాంచైజీకి ఒక మార్కీ ప్లేయర్‌తో పాటు కనీసం ఇద్దరు ఐకాన్‌ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి జట్టుకు రూ.45 లక్షల బడ్జెట్‌ కేటాయించగా.. గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లతో స్క్వాడ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. యువ క్రికెటర్లకు స్టార్‌ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం కల్పించి.. వారిని ఉన్నత స్థాయి క్రికెట్‌కు సిద్ధం చేయడమే ఈ లీగ్‌ ప్రధాన ఉద్దేశమని పీసీఏ భావిస్తోంది. పంజాబ్‌ క్రికెట్‌కు మరింత మంది ప్రతిభావంతులను అందించే వేదికగా షేర్‌-ఇ-పంజాబ్‌ టీ20 లీగ్‌ను తీర్చిదిద్దాలని భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

Updated Date - Aug 09 , 2026 | 07:33 PM