Share News

Virat Kohli: 2026 కొత్త ఏడాది వేళ.. విరాట్ ఎమోషనల్ పోస్ట్..

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:40 AM

కొత్త ఏడాది వేళ భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్‌ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.

Virat Kohli: 2026 కొత్త ఏడాది వేళ.. విరాట్ ఎమోషనల్ పోస్ట్..
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం అనేక కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఈ న్యూ ఇయర్ ఆనందాన్ని, శాంతిని తీసుకువస్తుందనే ఆశతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొత్త ఏడాది ప్రారంభాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం 2025కి బై బై చెబుతూ.. 2026కు ఘన స్వాగతం పలుకుతున్నారు. అంతేకాక తమ అభిమానులకు, కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. భారత్ వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సైతం తన భార్య అనుష్క శర్మతో ఉన్న ఫొటోను జోడించి.. ప్రత్యేక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ(Virat Kohli) గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్‌ చేశాడు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. 'నా జీవితపు వెలుగైన, నా సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma)తో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను' అని అనుష్క శర్మను ప్రశంసిస్తూ.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌కు గంటలోపే దాదాపు నాలుగు మిలియన్ల లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం పది మిలియన్లకు పైగా దూసుకుపోతూ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ, భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే ముందు.. కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు.


ఇక, కోహ్లీ క్రికెట్ విషయానికి వస్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న ఓ సంచలనాత్మక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీ కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేయడానికి అతనికి 25 పరుగులు అవసరం కానున్నాయి. 25 పరుగులు పూర్తి చేస్తే.. 28,000 పరుగుల మైలురాయిని సాధించిన అత్యంత వేగవంతమైన క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. సచిన, శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. సచిన్ 644 ఇన్నింగ్స్‌లలో, సంగక్కర తన 666వ ఇన్నింగ్స్‌లో 28 వేల పరుగులు సాధించగా.. కోహ్లీ కేవలం 623 ఇన్నింగ్స్‌లలోనే 27,975 పరుగులు చేశాడు. ఫలితంగా, సచిన్ రికార్డును అధిగమించడానికి అతనికి ఎక్కువ అవకాశం ఉంది.


న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనే కింగ్ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకుంటాడని క్రికెట్ ప్రియులు భావిస్తున్నారు. విజయ్ హజారే టోర్నీలో ఢిల్లీ తరఫున ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో కోహ్లీ(Virat Kohli) మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా 131, 77 పరుగులతో సూపర్ ఫామ్ కొనసాగించాడు. ఈ క్రమంలో అతను లిస్ట్-ఏ క్రికెట్‌లో వేగంగా 16,000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచాడు. తన 330వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని, 391 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన దిగ్గజ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.


ఇవీ చదవండి:

Chris Lynn: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!

Updated Date - Jan 01 , 2026 | 11:45 AM