Share News

Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో కోహ్లీ

ABN , Publish Date - Jan 14 , 2026 | 02:36 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. చివరిసారిగా 2021లో విరాట్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టాప్-1గా నిలిచాడు.

Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో కోహ్లీ
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. నాలుగేళ్ల తర్వాత ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో మరోసారి నెంబర్ 1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. కొంతకాలం పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా సిరీసే కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి వన్డే సిరీస్ కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ కోహ్లీ తనలోని అసలైన ప్లేయర్ ను మేల్కొలిపి, ఆసీస్ టూర్ నుంచి తిరిగి సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. అతను ఇటీవల వన్డే మ్యాచుల్లో వరుసగా ఐదు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో వన్డే ర్యాంకింగ్స్ పట్టికలో కోహ్లీ తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి.. అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ ర్యాంకింగ్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి. 2021లో చివరిసారిగా కోహ్లీ టాప్‌-1గా ఉన్నాడు.


న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో కోహ్లీ 93 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇది వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లీని అగ్రస్థానానికి చేర్చింది. ఇటీవల విరాట్ వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో 2027 వన్డే ప్రపంచ కప్ కోసం తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. మరోవైపు, రోహిత్ న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 26 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మూడవ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించడంతో, అతను జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.


ICC ODI బ్యాటర్స్ ర్యాంకింగ్:

1. విరాట్ కోహ్లీ -785

2. డారిల్ మిచెల్- 784

3. రోహిత్ శర్మ- 775

4. ఇబ్రహీం జద్రాన్- 764

5. శుభ్‌మన్‌ గిల్‌- 725

6. బాబర్ ఆజం- 722

7. హ్యారీ టెక్టర్ -708

8. షాయ్ హోప్- 701

9. చరిత్ అసలంక- 690

10. శ్రేయస్ అయ్యర్- 682


ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్‌ గిల్‌ వరుసగా రెండో హాఫ్‌సెంచరీ..

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!

Updated Date - Jan 14 , 2026 | 03:39 PM