ICC T20 WC 2026: పాక్ సంతతి ఆటగాళ్ల వీసాల తిరస్కరణ.. క్లారిటీ!
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:05 PM
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026.. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ ముందు మరోసారి వివాదం చెలరేగింది. అమెరికా క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ సంతతి ఆటగాళ్లకు భారత్ వీసాలు నిరాకరించిందన్న ప్రచారం కలకలం రేపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026.. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే ఈ టోర్నీ ముందు మరోసారి వివాదం చెలరేగింది. అమెరికా(USA) క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ సంతతి ఆటగాళ్లకు భారత్ వీసాలు నిరాకరించిందన్న ప్రచారం కలకలం రేపింది. ఫిబ్రవరి 7న భారత్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సిన యూఎస్‌ఏ జట్టుకు ఇంకా నెల కూడా సమయం లేకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
అలీ ఖాన్, జహంగీర్, మహ్మద్ మెహ్సిన్, ఆదిల్.. అనే నలుగురు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. అయితే భారత్ తన వీసా నిరాకరించిందనే అర్థం వచ్చేలా అలీ ఖాన్ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో వీసా తిరస్కరణ జరిగిందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఇది వాస్తవం కాదని తేలింది. వీసాలను నిరాకరించలేదని, ఇంకా జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం యూఎస్‌ఏ జట్టు కొలంబోలో ఉంది. మిగతా సభ్యుల వీసా ప్రక్రియ అక్కడి భారత హై కమిషన్ ఆధ్వర్యంలో ముగిసింది. కానీ పాక్ సంతతికి చెందిన నలుగురు ఆటగాళ్ల వీసాల జారీలో మాత్రం జాప్యం నెలకొంది.
‘వారు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఈ దశలో వీసాలను ప్రాసెస్ చేయలేమని ఆ ఆటగాళ్లకు సమాచారం అందింది. సాయంత్రం తరువాత, అమెరికా మేనేజ్‌మెంట్‌కు భారత రాయబార కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. అవసరమైన సమాచారంలో కొంతే అందిందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా అదనపు సమాచారం రావాల్సి ఉంది’ అని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!