Sikandar Raza: అదరగొట్టిన సికందర్ రజా.. సంచలన విజయం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:18 AM
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా అదరగొట్టాడు. పార్ల్ రాయల్స్ ఆల్‌రౌండర్ రజా చివరి బంతిని సిక్సర్‌గా మలిచి.. తన జట్టును గెలిపించాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయ సంబరాలు చేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఓడిపోతున్న మ్యాచ్ గెలిస్తే.. ఆ కిక్ వేరేగా ఉంటుంది. ఇక చివరి బంతికి సిక్స్ కొట్టి.. మ్యాచ్‌ను గెలిపించిన ప్లేయర్లు.. ఆ ఆనందంలో సింహగర్జన చేయడం సహజం. దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SA T20 League) 2025-26లో జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా అదే పనిచేశాడు. పార్ల్ రాయల్స్ ఆల్‌రౌండర్ రజా చివరి బంతికి సిక్స్ కొట్టి.. తన జట్టును గెలిపించాడు. అనంతరం సింహగర్జన చేస్తూ గెలుపు సంబరాలు చేసుకున్నాడు. డర్బన్ సూపర్ జెయింట్స్, పార్ల్ రాయల్స్ మధ్య మంగళవారం జరిగిన రసవతర్త సమరంలో ఈ అపూర్వ దృశ్యం చోటుచేసుకుంది.
ఇక మ్యాచ్(Paarl Royals vs Durban Super Giants) విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(66), లియామ్ లివింగ్‌స్టోన్(32 నాటౌట్) రాణించారు. అలానే రాయల్స్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు. ఇక 187 పరుగుల టార్గెట్‌తో రాయల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగి.. చివరి బంతికి విజయాన్ని అందుకుంది. డాన్ లారెన్స్ (63), రూబిన్ హెర్మన్ (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్ గెలుపునకు పునాదులు వేశారు. ఇక ఆఖర్లో సికందర్ రజా(27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
పార్ల్ రాయల్స్‌కు 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా.. ఊహించని విధంగా సూపర్ జెయింట్స్ బౌలర్ డేవిడ్ వీస్‌పై ఎదురుదాడి చేశాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్సర్ కొట్టాడు. దీంతో పార్ల్ రాయల్స్ జట్టు అద్భుత విజయం అందుకుంది. గెలుపు అనంతరం మరో ఎండ్‌లో ఉన్న రూబిన్ హెర్మన్‌ను హత్తుకుని రజా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వాస్తవానికి చివరి ఓవర్‌కు ముందు రాయల్స్ గెలుపునకు 6 పరుగులు మాత్రమే కావాలి. వీస్ తొలి 5 బాల్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్.. రాయల్స్ విజయాన్ని అడ్డుకునేలా కనిపించాడు. అయితే రజా(Sikandar Raza last ball six) సంచలన ప్రదర్శనతో రాయల్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు ఉంది.
ఇవి కూడా చదవండి:
మరో 34 పరుగుల దూరంలో.. రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
గంభీర్‌తో రో-కోకు ఎలాంటి విభేదాలు లేవు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు