Shreyas Iyer: మరో 34 పరుగుల దూరంలో.. రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:30 AM
న్యూజిలాండ్-భారత్ జట్లు నేడు రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ అద్భుతమైన రికార్డును సాధించే అవకాశం ఉంది. మరో 34 పరుగులు చేస్తే వన్డేల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కేవలం34 పరుగులు చేస్తే.. ఓ అద్భుతమైన రికార్డు తన ఖాతాలో పడనుంది. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ప్రస్తుతం వన్డేల్లో 68 ఇన్నింగ్స్‌ల్లో 47.83 యావరేజ్‌తో 2,966 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి. అతడు మరో 34 రన్స్ చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది.
ఈక్రమంలో శ్రేయస్ అయ్యర్.. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించారు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మూడువేల పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా, వీవీయన్ రిచర్డ్స్‌తో సమంగా నిలుస్తాడు. ఈ జాబితాలో హషిమ్ ఆమ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
గాయం బారిన పడిన శ్రేయస్.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో 47 బంతుల్లో నాలుగు ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 76 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు