Ind Vs NZ: బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:26 AM
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆయుష్ బదోనిని తీసుకున్న విషయం తెలిసిందే. అతడి ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్ వేదికగా టీమిండియా రెండో వన్డే మ్యాచ్‌లో తలపడనుంది. అయితే తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్రంగా గాయపడటంతో.. అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆయుష్ బదోని(Ayush Badoni )ని తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే అతడి ఎంపికపై క్రికెట్ మాజీల నుంచి అభిమానుల వరకు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ స్థానంలో రియాన్ పరాగ్ లేదా రింకు సింగ్‌ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ స్పందించారు.
‘ఇండియా ఏ తరఫున పలు మ్యాచుల్లో బదోని అర్ధ శతకాలు చేయడంతో పాటు మంచిగా బౌలింగ్ వేశాడు. ఐపీఎల్(IPL)లోనూ సత్తా చాటాడు. వాషింగ్టన్‌లా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల ఆటగాడు కావడంతో రీప్లేస్‌మెంట్‌గా అతడు సరైన ఎంపిక. వాషింగ్టన్ లాంటి ఆల్‌రౌండర్ గాయపడితే కేవలం ఐదుగురు బౌలర్లతో జట్టును నిలబెట్టడం కష్టం. మ్యాచ్ మధ్యలో ఇంకొక బౌలర్ గాయపడితే పరిస్థితి ఏంటి? అందుకే ఆరో బౌలింగ్ ఆప్షన్ తప్పనిసరి. బదోని నాలుగు-ఐదు ఓవర్లు వేయగలడు, అవసరమైతే బ్యాట్‌తో కూడా కీలక పరుగులు చేస్తాడు’ అని కోటక్ వివరించారు.
కెరీర్ ఇలా..
లిస్ట్ ఏ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన బదోని 693 పరుగులు చేశాడు. సగటు 36.47 కాగా, 93కి పైగా స్ట్రైక్‌రేట్ ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో 18 వికెట్లు కూడా తీసి తన ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. గతేడాది దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికార వన్డేల్లో ఒక మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఏ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 56 మ్యాచ్‌లు ఆడిన బదోని 963 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్‌లో 138కి పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశాడు.
ఇవి కూడా చదవండి:
మరో 34 పరుగుల దూరంలో.. రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
గంభీర్‌తో రో-కోకు ఎలాంటి విభేదాలు లేవు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు