Ind Vs NZ: మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:45 PM
న్యూజిలాండ్-భారత జట్లు ఇండోర్ వేదికగా మూడో వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ భారీ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇండోర్ మైదానంలో చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత జట్లు ఇండోర్ వేదికగా మూడో వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్.. ఏకంగా 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్(137) భారీ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇండోర్ మైదానంలో చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది..
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిచెల్ (Daryl Mitchell).. కీలక సమయంలో క్రీజులో పాతుకుపోయి భారీ శతకం సాధించాడు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. గ్లెన్ ఫిలిప్స్(106)తో కలిసి నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే మిచెల్ 45వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఎట్టకేలకు ఔటయ్యాడు. డగౌట్ వైపు వెళ్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద నిలబడి ఉన్న విరాట్ కోహ్లీ(Virat Kohli) మిచెల్ నాక్‌ను చప్పట్లు కొడుతూ అభినందించాడు. కానీ ఆ తర్వాతే ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. భారీ ఇన్నింగ్స్ ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడనే ఉద్దేశంతో.. మిచెల్ వెళ్తుంటే కోహ్లీ అతడిని మైదానం నుంచి బయటకు నెడుతూ కనిపించాడు. దీన్ని చూసి మిచెల్‌తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం టీమిండియా అభిమానుల మనసులో ఉన్న విషయాన్ని కోహ్లీ చేసి చూపించాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే..
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు పడగొట్టారు. అయినప్పటికీ డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలు న్యూజిలాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాయి. కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు సాధించింది. ఈ సిరీస్‌లో మిచెల్ వరుసగా రెండో సెంచరీతో మెరిశాడు. కాగా 338 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా.. 5 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. ఫోక్స్ బౌలింగ్‌లో క్లార్కేకి క్యాచ్ ఇచ్చి ఓపెనర్ రోహిత్ శర్మ(11) పెవిలియన్ చేరాడు.
ఇవి కూడా చదవండి:
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్