Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:33 PM
అండర్-19 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్‌తో బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు అతడిని ఔట్ చేస్తే.. సగం మ్యాచ్ గెలిచినట్లుగా ఫీల్ అవుతోందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక అద్భుతాలు సృష్టించిన వైభవ్.. తాజాగా అండర్-19 ప్రపంచ కప్‌లో స్టన్నింగ్ క్యాచ్ అందుకుని క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో వైభవ్.. బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్-19 ప్రపంచ కప్‌లో(Under 19 World Cup) భాగంగా శనివారం.. భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో) బంగ్లాదేశ్‌పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. ఛేదనలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. ఇక.. బంగ్లా బ్యాటింగ్ సందర్భంగా.. యువ సంచలనం వైభవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 25.2 ఓవర్‌లో విహాన్ మల్హోత్రా వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ బాసిర్ రతుల్ భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లో ఎగురుతూ సిక్సర్ వెళ్లేలా కనిపించింది. సరిగ్గా బౌండరీ లైన్ వద్ద ఉన్న వైభవ్ ఏమాత్రం తడబడకుండా అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టాడు.
ఇంతలో.. తన బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ దాటే అవకాశమున్నట్టు గ్రహించిన వైభవ్.. వెంటనే తెలివిగా బంతిని లోపలికి విసిరి, సెకన్ల వ్యవధిలో తిరిగి మైదానంలోకి వచ్చి ఆ క్యాచ్‌ను పూర్తి చేశాడు. అతడు అందుకున్న క్యాచ్(Stunning Catch) చూసి మైదానంలోని ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధిత దృశ్యం.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీలో టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్ కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ కూడా వైభవ్ చిచ్చర పిడుగే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
7 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్ చివర్లో అదిరే ట్విస్ట్.!
రాణించిన అభిజ్ఞాన్, వైభవ్.. బంగ్లాదేశ్ టార్గెట్ 239..