Damian Martin: నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న ఆసీస్ స్టార్ ప్లేయర్
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:42 PM
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(Damian Martin).. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స కోసం అతడిని కొద్ది రోజులు వైద్యులు కోమా స్థితిలో ఉంచారు. గతేడాది డిసెంబర్ చివరిలో మార్టిన్ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘నన్ను(డామియన్ మార్టిన్) ఆసుపత్రికి తరలించే సమయానికి నేను బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని వైద్యులు తెలిపారు. మెనింజైటిస్ నా మెదడును ఆక్రమించినప్పుడు నేను పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి జారుకున్నాను. ఈ వ్యాధితో పోరాడటానికి వైద్యులు నాకు చాలా సాయం చేశారు. వారు నన్ను 8 రోజులపాటు కోమాలో ఉంచారు. నేను కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు రోజుల వరకు మాట్లాడలేకపోయాను, నడవలేకపోయాను. తర్వాత డాక్టర్ల ప్రోత్సాహంతో అవన్నీ చేయగలిగాను. రికవరీ ప్రారంభమైన తర్వాత వైద్యులు నన్ను డిశ్చార్జి చేశారు. నేను తిరిగి ఇంటికి రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. బీచ్‌లోని ఇసుకలో నా పాదాన్ని మళ్లీ మోపగలిగాను. వైద్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని మార్టిన్ పేర్కొన్నాడు.
డామియన్ మార్టిన్ ఆసీస్ తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో 88 పరుగులు చేశాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అతడు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 80.33 యావరేజ్‌తో 241 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి:
ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్
ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!