U19 WC 2026: ప్రపంచ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:46 PM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడుతున్న మ్యాచులో వైభవ్ 72 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో 50కి పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. 14 ఏళ్లకే అండర్ 19 ప్రపంచ కప్ ఆడుతున్న వైభవ్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 67 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 72 పరుగులు చేసిన ఈ కుర్రాడు.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. తన దూకుడుతో జట్టు(U19 World Cup 2026)కు శుభారంభాన్ని అందించిన వైభవ్.. కేవలం 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14 సంవత్సరాల 296 రోజుల వయసులో పురుషుల అండర్ 19 ప్రపంచకప్‌లో 50కుపైగా స్కోరు చేసిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ ఆటగాడు షాహిదుల్లా కమాల్(15 ఏళ్లు 19 రోజులు) పేరిట ఉంది. తాజాగా ఈ రికార్డును వైభవ్(Vibhav Suryavanshi) అధిగమించాడు.
ఈ జాబితాలో ఉన్నదెవరంటే..
14 సంవత్సరాల 296రోజులు- వైభవ్ సూర్యవంశీ(భారత్, 2026)
15సంవత్సరాల 19రోజులు- షాహిదుల్లా కమాల్(అఫ్గానిస్థాన్,2014)
15సంవత్సరాల 92రోజులు- బాబర్ ఆజమ్(పాకిస్థాన్, 2010)
15సంవత్సరాల 125రోజులు- పర్వేజ్ మాలిక్ జై(అఫ్గానిస్థాన్,2016)
15సంవత్సరాల 132రోజులు - శరద్ వేసావ్కర్(నేపాల్, 2004)
విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు..
ఇదే మ్యాచ్‌లో వైభవ్ మరో ఘనతను కూడా సాధించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. 20 యూత్ వన్డేలు ఆడిన వైభవ్.. 1,047 పరుగులు చేయగా, కోహ్లీ 28 మ్యాచ్‌ల్లో 978 పరుగులే సాధించాడు. ఈ జాబితాలో భారత్ తరఫున విజయ్ జోల్(1,404 పరుగులు) ముందుండగా.. మొత్తం యూత్ వన్డేల్లో బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హుస్సెన్ శాంటో(1,820 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్
ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!