Share News

U19 World Cup: పాకిస్థాన్ బ్యాటర్ వింత రనౌట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 17 , 2026 | 02:53 PM

అండర్-19 ప్రపంచ కప్‌లో వింత రనౌట్ జరిగింది. అది కూడా పాకిస్థాన్, ఇంగ్లాండ్ మ్యాచులో చోటుచేసుకుంది. ఆ రనౌట్ కారణంగా పాకిస్థాన్ ఓడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

U19 World Cup: పాకిస్థాన్ బ్యాటర్ వింత రనౌట్.. వీడియో వైరల్
Ali Raja

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ మ్యాచుల్లో అనేక రకాల వింత సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా క్యాచ్‌లు, రనౌట్ సమయాల్లో చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా.. అండర్-19 ప్రపంచ కప్-2026లో భాగంగా పాకిస్థాన్, ఇంగ్లాండ్(England vs Pakistan cricket) మధ్య జరిగిన మ్యాచులో ఓ రనౌట్ తీరు వింతగా జరిగింది. ఈ రనౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్నీ ఇలా కూడా రనౌట్ అవుతారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో(ICC Under 19 World Cup 2026) భాగంగా హరారే వేదికగా శుక్రవారం.. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్‌కు దిగి.. 46.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ జట్టు 46.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. అయితే.. చివరి వికెట్‌గా అలీ రజా రనౌట్‌ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.


పాకిస్థాన్‌ గెలవడానికి 38 పరుగులు చేయాల్సిన సమయంలో మోమిన్‌ ఖమర్‌ బంతిని వికెట్‌ మీదుగా కొట్టి, సింగిల్‌ కోసం పరుగెత్తాడు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అలీ రజా పరుగు తీశాడు. రజా స్ట్రైకర్‌ ఎండ్‌కు చాలా తేలికగా చేరుకున్నాడు. రెండో పరుగు కోసం అతడు మళ్లీ క్రీజు నుంచి కాస్త ముందుకు వెళ్లాడు. కానీ, అప్పటికే ఫీల్డర్‌ ద్వారా బంతిని అందుకున్న ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ థామస్‌.. రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ఇదే సమయంలో అలీ క్రీజులోకి చేరుకోవడానికి ప్రయత్నించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంపైర్‌ కూడా అలీ రజాను(Ali Raja run out) రనౌట్‌గా ప్రకటించాడు. రజానే చివరి వికెట్‌గా పెవిలియన్ చేరడంతో పాక్ ఓటమి పాలైంది. ఈ వీడియో క్లిప్‌ను ఐసీసీ(ICC) తన ఇన్‌స్టా అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేయగా.. వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?

బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్

Updated Date - Jan 17 , 2026 | 03:27 PM