Pretoria Capitals: 7 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్ చివర్లో అదిరే ట్విస్ట్.!
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:56 AM
సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో అద్భుతం జరిగింది. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకుని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అంతేకాకుండా 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ చరిత్రలో అనేక జట్లు స్వల్ప స్కోర్లు నమోదు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని జట్లు 50 పరుగులలోపే అలౌటైన సందర్భాలూ అనేకం. తాజాగా.. ఓ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ ఆ టీమ్ గెలుస్తుందని ఎవరైనా అనుకుంటారా.? మహా అయితే మరికొన్ని పరుగులు చేసి.. ఆలౌట్ అవుతుందని భావిస్తారు. కానీ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో(SA20 League) అద్భుతమే జరిగింది. ప్రిటోరియా క్యాపిటల్స్ టీమ్ అసాధారణ ప్రదర్శనతో సంచలన విజయం నమోదు చేసింది. వివరాల్లోకి వెళ్తే...
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం.. ప్రిటోరియా క్యాపిటల్స్(Pretoria Capitals ), జోబర్గ్ సూపర్ కింగ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రధాన బ్యాటర్లందరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇక ఆ జట్టు 50 పరుగులు దాటడం కష్టమని అంతా భావించారు. ఇలా నిరాశలో కూరుకుపోయిన దశలో డెవాల్డ్ బ్రెవిస్(47 బంతుల్లో 53),షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(50 బంతుల్లో 74*) జోడీ వీరోచిత పోరాటం చేసింది. దీంతో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 103 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ జోడీని విడదీసేందుకు జోబర్గ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
చివరకు.. బ్రెవిస్‌ను మాత్రమే ఔట్ చేయగలిగారు. మొత్తంగా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. జోబర్గ్ బౌలర్లలో డేనియల్ వారెల్, వియాన్ ముల్దర్ చెరో రెండు వికెట్లు తీశారు. డుయాన్ జన్సెన్, బర్గర్ చెరో వికెట్ సాధించారు. వీరి ధాటికి క్యాపిటల్స్ టాపార్డర్ కకావికలమైంది. అనంతరం.. స్వల్ప లక్ష్యాన్ని సాధించలేక జోబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings) ఓటమి చవిచూసింది. లిజాడ్ విలియమ్స్, కేశవ్ మహరాజ్ చెరో మూడు వికెట్లు తీసి.. క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. రోస్టన్ ఛేజ్, గిడ్యోన్ పీటర్స్ చెరో వికెట్ సాధించారు. క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితం కాగా.. 12 పరుగుల తేడాతో క్యాపిటల్స్ టీమ్ గెలుపొందింది.
ఇవి కూడా చదవండి:
రాణించిన అభిజ్ఞాన్, వైభవ్.. బంగ్లాదేశ్ టార్గెట్ 239..