వయసుతో సంబంధం లేదు.. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే: గంభీర్
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:07 PM
అఫ్గానిస్థాన్ సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతడు తన అవకాశాల కోసం ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అఫ్గానిస్థాన్ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్‌పైనే టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అఫ్గాన్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్ల కంటే అనుభవం ఉన్న ఆటగాళ్లకే ముందుగా ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించాడు. వైభవ్ తన అవకాశాల కోసం ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు.
‘వైభవ్ సూర్యవంశీ విషయంలో చాలా చర్చ జరిగింది. అతడు తన అవకాశం కోసం వేచి ఉండాల్సిందే. అతడిలో ఎలాంటి ప్రతిభ ఉందో.. అవకాశం దక్కితే ఏం చేయగలడో మాకు తెలుసు. కానీ కొంతకాలంగా జట్టులో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్.. ఇప్పుడే జట్టులోకి వచ్చిన ఆటగాడి కంటే ముందుంటాడు. వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఆడే అవకాశం కూడా ఉంటుంది. భారత క్రికెట్‌లో పోటీ, ప్రతిభ ఉండటం చాలా ముఖ్యం. 15 ఏళ్ల యువ ప్లేయర్ అయినా, 30 ఏళ్ల సీనియర్ ప్లేయర్ అయినా.. అవకాశం కోసం ఎదురుచూడాల్సిందే’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
సంజు శాంసన్‌కు గంభీర్ మద్దతు
వైభవ్ స్థానంలో మూడు మ్యాచ్‌ల్లోనూ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌నే తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ ఎంపికను గంభీర్ సమర్థించాడు. సంజూ ప్రతిభ, గత ప్రదర్శనలు అతడికి జట్టులో చోటు కల్పించేందుకు సరిపోతాయని అన్నాడు. ‘సంజు ప్రతిభే అతడు జట్టులో ఉండేందుకు సరిపోతుంది. అతడు ఏం చేయగలడో ఇప్పటికే చూపించాడు. ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవడం అంటే మామూలు విషయం కాదు కదా? అతడు జట్టు కోసం ఇప్పటికే చాలా చేశాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిని పక్కన పెట్టడం నా కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయం. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన అకస్మాత్తుగా చెత్త ప్లేయర్లుగా మారిపోరు. ప్రపంచ కప్ నుంచి మరో ప్రపంచ కప్ వరకు అజేయంగా నిలిచి టైటిల్ గెలిచిన జట్టు ఇది. కేవలం ఒక సిరీస్ ఫలితం ఆధారంగా జట్టును తక్కువగా అంచనా వేయలేం’ అని గంభీర్ వివరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లికి ముందే బ్రేకప్