Share News

ఆసియా క్రీడల్లో జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, కోచ్‌ అశోక్‌ మిశ్రాకు షాకింగ్ అనుభవం..

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:37 AM

ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి ఆరంభంలోనే అడుగడుగునా అవస్థలు ఎదురవుతున్నాయి. భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, ఆమె కోచ్‌ అశోక్‌ మిశ్రాకి కూడా షాకింగ్ అనుభవం ఎదురైంది. క్రూయిజ్ షిప్‌లో వారిద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది.

ఆసియా క్రీడల్లో జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, కోచ్‌ అశోక్‌ మిశ్రాకు షాకింగ్ అనుభవం..
Asian Games 2026

నాగోయా: ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు వెళ్లిన భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, ఆమె కోచ్‌ అశోక్‌ మిశ్రాకు షాకింగ్ అనుభవం ఎదురైంది. గురువారం నాడు క్రూయిజ్ షిప్‌లో వారిద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది. అథ్లెట్‌, సహాయక సిబ్బందికి ఒకే గది కేటాయించడంపై ప్రణతి నాయక్, అశోక్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే భారత బృందం అధికారులను స్థానిక నిర్వాహకులు సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సమస్య గంటల తరబడి పరిష్కారం కాలేదు.


ఐఓఏ జోక్యంతో పరిష్కారం..

ఈ విషయం భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) దృష్టికి వెళ్లడంతో అత్యవసరంగా ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటలకు ప్రత్యేక గది కేటాయింపు పూర్తయింది. అయితే అక్కడితో అశోక్‌ మిశ్రా కష్టాలు తీరలేదు. ప్రత్యేక గది కోసం తాళాలు తీసుకునేందుకు వెళ్లిన ఆయనకు హోటల్‌ సిబ్బంది మరో షాక్‌ ఇచ్చారు. రిజిస్టర్‌లో ఆయన బుకింగ్‌ కనిపించడం లేదని తెలిపారు. అధికారిక రికార్డుల్లో ఆయన పేరులోని ‘I’ అక్షరం మిస్ అవ్వడమే ఇందుకు కారణంగా తేలింది. దీంతో పేరు, అక్రిడిటేషన్‌ వివరాలను మరోసారి పరిశీలించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు మరో 45 నిమిషాలు పట్టడంతో రాత్రి 2 గంటలు దాటిన తర్వాతే గది తాళాలు ఆయన చేతికి అందాయి. ఈ ఘటనపై ప్రణతి నాయక్‌ స్పందించారు. వసతి విషయంలో గందరగోళం చోటుచేసుకున్న మాట వాస్తవమేనని, సుమారు రాత్రి 2 గంటల సమయంలో సమస్య పరిష్కారమైందని తెలిపారు.


పలువురు క్రీడాకారులకూ ఇదే పరిస్థితి..

ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి ఆరంభంలోనే అడుగడుగునా అవస్థలు ఎదురవుతున్నాయి. వసతి కేటాయింపులు, చెక్‌ఇన్‌, శిక్షణ, పౌష్టికాహారం వంటి సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. భారత కబడ్డీ బృందానికీ హోటల్‌ కేటాయింపు, చెక్‌ఇన్‌ సమయంలో ఇలాంటి సమస్యలే ఎదురైనట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఆసియా క్రీడలు ప్రారంభం కాకముందే భారత బృందం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇకనైనా ఇలాంటి సమస్యలకు తెరపడాలని, క్రీడాకారులు పూర్తిగా తమ ప్రదర్శనపైనే దృష్టి సారించాలని భారత బృందం ఆశిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

రెండో రౌండ్‌లోనూ విజయాలు

పెళ్లికి ముందే బ్రేకప్‌

Updated Date - Sep 18 , 2026 | 11:56 AM