Share News

విరాట్ భయ్యా నాకు పెద్దన్నయ్యలా సలహాలు ఇచ్చాడు: వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Jun 07 , 2026 | 03:36 PM

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కోహ్లీ తనతో మాట్లాడిన విషయాల గురించి వైభవ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.

విరాట్ భయ్యా నాకు పెద్దన్నయ్యలా సలహాలు ఇచ్చాడు: వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే అప్పుడు కోహ్లీ తనతో మాట్లాడిన విషయాల గురించి వైభవ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. విరాట్ తనతో మాట్లాడిన క్షణాలు ఇప్పటికీ కలలాగా అనిస్తాయని వెల్లడించాడు.


‘నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఆర్సీబీకి అభిమానిని. అంతకంటే ఎక్కువగా విరాట్ కోహ్లీకి వీరాభిమానిని. అలాంటి కోహ్లీ భయ్యా నా భుజంపై చేయి వేసి మాట్లాడినప్పుడు అది కలలా అనిపించింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే.. ప్రపంచ క్రికెట్ దిగ్గజం ఒకరు నాతో మాట్లాడుతున్నట్లు అస్సలు అనిపించలేదు. నాకు ఒక పెద్దన్నయ్యలా సలహాలు ఇచ్చాడు. నాకు క్రికెట్‌కు సంబంధించి పలు విలువైన సూచనలు చేశాడు. నేను ఇంకా ఏ అంశాల్లో మెరుగుపడాలి.. భవిష్యత్తులో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి.. లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి.. వంటి విషయాలను చెప్పాడు. ఆయన మాటలు నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి’ అని వైభవ్ వెల్లడించాడు. వైభవ్ క్యాప్‌పై కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై కూడా వైభవ్ స్పందించాడు. ‘ఆ క్యాప్‌ను నేను చాలాసార్లు ధరించాను. ఆరెంజ్ క్యాప్ నా దగ్గర లేని సమయాల్లో ఎక్కువగా కోహ్లీ భయ్యా ఆటోగ్రాఫ్ చేసిన టోపీనే పెట్టుకునేవాడిని’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు.


ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌తో పాటు అత్యంత విలువైన ఆటగాడు (ఎంవీపీ) అవార్డును సొంతం చేసుకున్నాడు. మరోవైపు కోహ్లీ 675 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.


ఇవి కూడా చదవండి:

టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jun 07 , 2026 | 03:36 PM