టెస్టుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత
ABN , Publish Date - Jun 07 , 2026 | 02:43 PM
భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో గిల్(126) అద్భుత సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో గిల్(126) అద్భుత సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్-బ్యాటర్ల జాబితాలోకి చేరాడు. అతడి టెస్టు కెరీర్‌లో ఇది 11వ సెంచరీ కాగా.. కెప్టెన్‌గా ఆరో శతకం కావడం విశేషం.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో టెస్టు కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని గిల్ అధిగమించాడు. అఫ్గాన్‌పై సెంచరీతో టెస్టుల్లో అతడి పరుగుల సంఖ్య 1076కి చేరింది. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు బాదిన గిల్.. భారత కెప్టెన్లలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. విరాట్ కోహ్లీ(20), సునీల్ గావస్కర్(11), మహ్మద్ అజారుద్దీన్(9), సచిన్ టెండూల్కర్(7).. గిల్ కంటే ముందున్నారు.
మరో రికార్డు..
ఈ ఇన్నింగ్స్ ద్వారా గిల్ మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు కలిగిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు. ప్రస్తుతం గిల్ బ్యాటింగ్ యావరేజ్ 82.8గా ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్(101.5 సగటు) మాత్రమే గిల్ కంటే ముందున్నాడు. కెప్టెన్లుగా అత్యుత్తమ టెస్టు బ్యాటింగ్ సగటు కలిగిన ప్లేయర్ల జాబితాలో కుమార సంగక్కర(69.6), స్టీవ్ స్మిత్(68.1), మహేలా జయవర్ధనె(59.1) గిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్