Share News

బుమ్రా మాత్రమే కాదు.. భారత బౌలర్లందరూ ప్రమాదమే: కివీస్ కెప్టెన్

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:09 PM

న్యూజిలాండ్, భారత్ మధ్య గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం తమకు సవాలుతో కూడుకున్నదని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ వెల్లడించాడు.

బుమ్రా మాత్రమే కాదు.. భారత బౌలర్లందరూ ప్రమాదమే: కివీస్ కెప్టెన్
Tom Latham

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్, భారత్ మధ్య గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం తమకు సవాలుతో కూడుకున్నదని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ వెల్లడించాడు. బుమ్రా మాత్రమే కాదని భారత బౌలర్లందరూ ప్రమాదకారులే అని తెలిపాడు. గురువారం ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు లాథమ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.


‘బుమ్రా తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ముఖ్యంగా సీమర్లకు అనుకూలించే న్యూజిలాండ్ పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని. అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అయితే బుమ్రాతో పాటు భారత జట్టులోని ఇతర బౌలర్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం’ అని లాథమ్ పేర్కొన్నాడు.


ముగ్గురు పేసర్లతో బరిలోకి..!

భారత్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో ముగ్గురు ప్రధాన పేసర్లు, ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనున్నట్లు లాథమ్ వెల్లడించాడు. మ్యాట్ హెన్రీ, జేమీసన్, జాకబ్ డఫీ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. నాథన్ స్మిత్ అదనపు బౌలింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉండనున్నాడు. భారత్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా కంకషన్‌కు గురైన మ్యాట్ హెన్రీ కోలుకుని టెస్టులకు సిద్ధమవడం న్యూజిలాండ్‌కు ఊరటనిచ్చే అంశం. భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో హెన్రీ ఆరు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఈ సిరీస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత సైకిల్‌లో ఆరు టెస్టులు ఆడిన న్యూజిలాండ్ నాలుగు విజయాలు, ఒక ఓటమితో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ నాలుగో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది జరిగే ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ కీలకం కానుంది.


ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 18 , 2026 | 07:09 PM